Nara Rohit : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్..!
- By Vamsi Chowdary Korata Published Date - 03:11 PM, Fri - 24 October 25
టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన కోస్టార్ శిరీషతో ఆయన వివాహం జరగనుంది. అక్టోబర్ 30న హైదరాబాద్ లో వైభవంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఇవాళ శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
నటుడు శ్రీ నారా రోహిత్ కలిసి ఈ నెల 30న జరిగే తన వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు. pic.twitter.com/dpGM6wOrtb
— Revanth Reddy (@revanth_anumula) October 24, 2025
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్, తన వివాహానికి కుటుంబ సమేతంగా హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. తుమ్మల నాగేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డిలను కూడా రోహిత్ తన పెళ్లికి ఆహ్వానించారు. ఈ ఫోటోలను రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నారా రోహిత్ గత ఏడాది అక్టోబర్‌లో శిరీషతో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కుటుంబంలో జరిగిన అకాల మరణం కారణంగా వివాహం ,కాస్త ఆలస్యమైంది. తాజాగా పెద్దల అంగీకారంతో అక్టోబర్ 30న వివాహ ముహూర్తం ఖరారైంది. రోహిత్ స్వయంగా సినీ, రాజకీయ ప్రముఖులను తన పెళ్లికి ఆహ్వానిస్తూ శుభలేఖలు అందిస్తున్నారు.