CM Revanth Reddy : ఓటుకు నోటు కేసు..సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం
Nampally Court: నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు.. అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ నాంపల్లి కోర్టు ఆదేశించింది.
- By Latha Suma Published Date - 04:11 PM, Tue - 24 September 24

Vote for Note Case : ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన మంగళవారం నాంపల్లి కోర్టులో ఈడీ కేసులో విచారణ జరిగింది. ఈ కేసులో అక్టోబర్ 16న విచారణకు హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. ఈరోజు విచారణకు ముత్తయ్య మినహా మిగతా నిందితులందరూ గైర్హాజరు అయ్యారు. సీఎం రేవంత్, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అయితే నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు.. అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ నాంపల్లి కోర్టు ఆదేశించింది.
Read Also: Ram Chariot Caught Fire : అనంతపురంలో రాములవారి రథానికి నిప్పు..
కాగా, కొన్ని రోజుల క్రితం ఈ ఓటుకు నోటు కేసు బదిలీ పిటీషన్‌పై సుప్రీం కోర్టు కూడా విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందున ఆయన ప్రాసిక్యూషన్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున.. కేసును మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత జగదీశ్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కేసును బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను అనుమానంతో వేశారే తప్పా.. ఇందులో ప్రాథమిక ఆధారాలు కూడా లేవని కోర్టు అభిప్రాయపడింది. అలా రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కినా.. నాంపల్లి కోర్టు మాత్రం.. ఆయన అక్టోబర్ 16న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.