Minister Seethakka: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఆదేశాలు..!
వర్షాల వల్ల తలెత్తే ఎమర్జెన్సీ పరిస్థితులపై తక్షణ స్పందన అవసరమని, ఏ సమస్య ఎదురైనా వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
- By Gopichand Published Date - 06:12 PM, Sat - 16 August 25

Minister Seethakka: తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజల అవసరాలను గమనించి.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశించారు. అధిక వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో పరిస్థితులను పంచాయతీ రాజ్, గ్రామీణాబివృద్ది శాఖ డైరెక్టర్ సృజన, ఈఎన్సీలు కృపాకర్ రెడ్డి, ఎన్ ఆశోక్, ఇతర సంబంధిత అధికారులతో మంత్రి నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా మంచినీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా, అధిక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. తాగు నీటి కలుషితం జరగకుండా, ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచడం, నీటిని డబుల్ క్లోరినేషన్ చేసి సరఫరా చేయడం వంటి చర్యలు కొనసాగించాలని సూచించారు.
వర్షాల వల్ల తలెత్తే ఎమర్జెన్సీ పరిస్థితులపై తక్షణ స్పందన అవసరమని, ఏ సమస్య ఎదురైనా వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కలెక్టర్ల వద్ద ఇప్పటికే ప్రత్యేక నిధులు అందుబాటులో ఉన్నందున, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం మిషన్ భగీరథ అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నీటి సరఫరా కేంద్రాలు, భద్రతా ప్రమాణాలను తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా పంచాయతీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు గ్రామాల నుంచి రోడ్లు, కల్వర్లు దెబ్బతిన్న చోట్ల సమాచారం సేకరించి, తాత్కాలిక ప్రత్యామ్నాయ రహదారి సదుపాయాలను కల్పిస్తున్నారు.
Also Read: Heavy Rains : ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు.. కారు జలసమాధి
ఇప్పటికి అందిన సమాచారం మేరకు భారీ వర్షాల వల్ల పంచాయతీ రాజ్ విభాగానికి చెందిన రహదారులకు వాటిల్లిన నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 84.97 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు మంత్రి సీతక్కకు నివేదించారు. ఇందులో 48 ప్రాంతాకల్లో ఉపరితర రోడ్లు దెబ్బతినగా… తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ. 3.32 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.42.63 కోట్లు ఖర్చు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. కల్వర్ట్లు, లోకాజ్ వేలు, క్రాస్ డ్రేయిన్ పనులు మొత్తం 77 ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వీటికి తాత్కాలిక పనుల కోసం రూ. 1.55 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ. 57.60 కోట్లు వ్యయం కానుందని ఇంజనీర్లు అంచనా వేశారు.
30 ప్రాంతాల్లో గండ్లు పడగా.. తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ. కోటికి పైగా ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే శాశ్వత పునరుద్ధరణ కోసం రూ. 5.45 కోట్లు ఖర్చు అవుతాయని సమాచారం. మొత్తంగా పీఆర్ ఆర్డీ పరిధిలో మొత్తం 124 రోడ్లు దెబ్బతినగా..తాత్కాలిక పునరుద్ధరణ పనుల కోసం సుమారు రూ. 6 కోట్లు శాశ్వత పునరుద్ధరణ కోసం రూ. 141 కోట్ల వరకు ఖర్చు అవుతాయని అంచనా ఉంది. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక, శాశ్వత అవసరాల కోసం రూ. 147.70 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు పేర్కొన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.
ఇక గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో శిధిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి ప్రజలను అక్కడి తరలిస్తున్నారు. లొతట్టు ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా, వెంటనే పైఅధికారులకు సమాచారం అందించడంతోపాటు వెంటనే పరిష్కారం చూపిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో శాఖ ముందస్తు ఏర్పాట్ల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రధాన సమస్యలు తలెత్తకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భవిష్యత్తులో ఏవైనా కొత్త పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.