Harish Rao: మంత్రి కొండా సురేఖ వర్చువల్ సమీక్షా సమావేశం.. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశంలో హరీష్ రావు కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
- By Gopichand Published Date - 01:20 PM, Wed - 15 January 25

Harish Rao: తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం సీఎం రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం త్వరలోనే మరి కొన్ని పథకాలను అమలు చేసేందుకు జనవరి 26వ తేదీని ఫిక్స్ చేసుకుంది. అయితే అంతకంటే ముందు ఆయా మంత్రులు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.
తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ పథకాల తీరుపై ఇంచార్జి మంత్రి కొండా సురేఖ వర్చువల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) పాల్గొన్నారు. ఈ సమీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి తనదైన శైలిలో మంత్రికి ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని డిమాండ్ చేశారు.
Also Read: Rohit Sharma To Visit Pak: భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లనున్నాడా? నిజం ఇదే!
మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశంలో హరీష్ రావు కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయమని అన్నారు. కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలని మాజీ మంత్రి.. మంత్రి కొండా సురేఖకు సూచించారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ఎవరు చేస్తారు..? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తికాని ఇళ్ళకు కూడా నిధులు విడుదల చేయాలని ఆయన సరికొత్త డిమాండ మంత్రి ముందు ఉంచారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దేశ రాజధానిలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం రేవంత్ నేరుగా సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి నుంచి నేరుగా దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.