Caste Certificates: తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాలు.. ప్రాసెస్ ఇదే!
మీ సేవ కౌంటర్‌లో పాత సర్టిఫికెట్ నంబర్‌ను చెప్పడం ద్వారా కొత్త ప్రింటవుట్‌ను తక్షణమే పొందవచ్చు.
- By Gopichand Published Date - 02:45 PM, Fri - 12 September 25

Caste Certificates: కుల ధ్రువీకరణ పత్రాల (Caste Certificates) జారీ ప్రక్రియను సరళతరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు తమ కుల ధ్రువీకరణ పత్రాలను ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా నేరుగా పొందవచ్చు. ఈ కొత్త విధానం పౌరులకు సమయం, శ్రమ ఆదా చేయడంతో పాటు, పత్రాల జారీలో జాప్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు ఈ మార్పులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
పాత విధానంలో జాప్యం- కొత్త విధానంతో పరిష్కారం
గతంలో ప్రతి దరఖాస్తుకు తహసీల్దార్ నుండి కొత్తగా ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది. ఈ ప్రక్రియ వల్ల పౌరులు రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీనితో పత్రాల జారీలో జాప్యం, ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో మీ సేవ విభాగం దీనిపై దృష్టి సారించింది. సీసీఎల్‌ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, తహసీల్దార్లతో పలు దఫాలుగా చర్చలు, సమీక్షలు నిర్వహించిన అనంతరం ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.
ఈ కొత్త విధానాన్ని గత 15 రోజుల క్రితం ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చారు. ఈ స్వల్ప వ్యవధిలోనే 17,571 మంది పౌరులు ఈ సేవను విజయవంతంగా పొంది, ప్రయోజనం పొందారని అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. పాత విధానంలో ఉన్న ఇబ్బందులను ఈ నూతన ప్రక్రియ తొలగిస్తుంది.
Also Read: Tagore Hospital Scene : ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతదేహానికి చికిత్స
కొత్త సర్టిఫికెట్‌లో వివరాలు, ప్రత్యేక కేసుల మినహాయింపు
కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్‌లో గతంలో ఆమోదించిన అధికారి వివరాలు, తిరిగి జారీ చేసిన తేదీ స్పష్టంగా పేర్కొంటారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పాత విధానమే వర్తిస్తుంది. ఉదాహరణకు, హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి బీసీ-సీ కేటగిరీ కిందకు వస్తే (జీవో ఎంఎస్ నం.3, తేదీ 9.9.2020 ప్రకారం) ఆ దరఖాస్తును గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారు.
సేవను పొందడం ఎలా?
ఈ సేవను పొందడం అత్యంత సులభం అని మీ సేవ కమిషనర్ రవికిరణ్ తెలిపారు.
పాత సర్టిఫికెట్ నంబర్: మీ సేవ కౌంటర్‌లో పాత సర్టిఫికెట్ నంబర్‌ను చెప్పడం ద్వారా కొత్త ప్రింటవుట్‌ను తక్షణమే పొందవచ్చు.
నంబర్ తెలియకపోతే: నంబర్ తెలియని పక్షంలో మీ సేవ సిబ్బంది మీ జిల్లా, మండలం, గ్రామం, ఉప-కులం, పేరు వంటి వివరాలను ఉపయోగించి డేటాబేస్‌లో శోధిస్తారు. మీ వివరాలు అందుబాటులో ఉంటే వెంటనే కొత్త సర్టిఫికెట్ ప్రింట్ అవుట్ ఇస్తారు. మరిన్ని వివరాల కోసం పౌరులు మీ సేవ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ఈ కొత్త విధానం పౌర సేవలను వేగవంతం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని నిపుణులు పేర్కొన్నారు.