Telangana Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్డేట్.. చలాన్ కట్టకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్
- Author : Vamsi Chowdary Korata
Date : 20-03-2026 - 10:27 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad Traffic Police తెలంగాణలో వాహనదారులకు ఇది ముఖ్యమైన హెచ్చరిక. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, పెండింగ్ చలాన్లను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పదేపదే నిబంధనలు అతిక్రమించినా, జరిమానాలు కట్టకపోయినా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) స్తంభింపజేసే (ఫ్రీజ్) కఠిన నిబంధనలను అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. పెండింగ్ చలాన్ల వసూలు, వాటిపై వచ్చే వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఆన్లైన్లోనే ఫిర్యాదుల పరిష్కారం
కేంద్ర మోటార్ వాహన నిబంధనలకు అనుగుణంగా జరిమానాలపై వచ్చే అభ్యంతరాలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించేందుకు ‘గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ’ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్నట్లు సమాచారం. ఈ కొత్త విధానంలో వాహనదారులు తమ ఫిర్యాదులను కేవలం ఆన్లైన్ పోర్టల్ ద్వారానే నమోదు చేయాలి. సాంకేతిక లోపాలు, డేటా ఎంట్రీ పొరపాట్లు, వాహనం అమ్మిన తర్వాత వచ్చే తప్పుడు చలాన్ల వంటి సమస్యలను పోలీసు, రవాణా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తారు. హైదరాబాద్, సైబరాబాద్ వంటి కమిషనరేట్లలో ట్రాఫిక్ డీసీపీలు, ఇతర జిల్లాల్లో ఎస్పీలు, రవాణా శాఖలో ఆర్టీవోలు గ్రీవెన్స్ అధికారులుగా వ్యవహరిస్తారు.
స్పష్టమైన కాలపరిమితులు
చలాన్ల జారీ నుంచి పరిష్కారం వరకు ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితులను నిర్దేశించింది. కెమెరా ఆధారిత చలాన్‌ను 3 రోజుల్లో, మాన్యువల్ చలాన్‌ను 15 రోజుల్లోగా పంపాలి. చలాన్ అందిన 45 రోజుల్లో వాహనదారుడు జరిమానా కట్టాలి లేదా ఆన్లైన్లో అభ్యంతరం తెలపాలి. ఫిర్యాదు అందిన 30 రోజుల్లోగా అధికారులు తమ నిర్ణయం వెల్లడించాలి. అధికారుల నిర్ణయంపై అసంతృప్తిగా ఉంటే, చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించి కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించారు.
5 చలాన్లు దాటితే బ్లాక్
ఈ విధానంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఒక వాహనంపై ఏడాదిలో 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే, ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు వెళ్తుంది. వెంటనే సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన ఆర్సీని అధికారులు బ్లాక్ చేస్తారు. ఇలా బ్లాక్ అయిన తర్వాత ఆ వాహనానికి సంబంధించిన ఫిట్నెస్, యాజమాన్య బదిలీ వంటి ఏ ఆర్టీఏ సేవలు పొందడం సాధ్యం కాదు. పెండింగ్‌లో ఉన్న చలాన్లన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాతే ఈ సేవలను తిరిగి పునరుద్ధరిస్తారు. ఈ కఠిన నిబంధనల ద్వారా వాహనదారుల్లో బాధ్యతను పెంచడంతో పాటు, రాష్ట్రంలో రహదారి భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.