Nalgonda: నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఆస్పత్రిలో పనిచేసే పలువురు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఇతర ప్రాంతాలలో డిప్రెషన్ పై పని చేస్తున్నారని తెలుసుకున్న మంత్రి ఆస్పత్రి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిలోనే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
- By Gopichand Published Date - 07:11 PM, Sun - 5 January 25

Nalgonda: నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ రానుంది. నల్గొండ (Nalgonda) మదర్ చిల్డ్రన్ హెల్త్ సెంటర్‌కు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో భారీగా వైద్య పరికరాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందించారు. గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న ఏఎన్‌సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆయన నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆంటినేటల్ పరీక్షల భవన పనుల నిర్మాణానికి పూజ చేశారు.
గర్భస్థ పరీక్షల నిమిత్తం ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, అంతేకాక ప్రసవానికి ముందు ఆసుపత్రిలో చేరే వారు వారి సహాయకులకు అనువుగా ఉండేందుకుగాను ఈ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ నిర్మాణాన్ని నాణ్యతగా చేపట్టాలని, అంతేకాక సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆయన ఆదేశించారు. అనంతరం మంత్రి ఆసుపత్రిలోని పలు వార్డులను, విభాగాలను పరిశీలించారు. పోస్ట్ నేటల్ వార్డు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పోస్ట్ నేటల్ వార్డులో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Also Read: Anjeer Leaf: కేవలం అంజీర పండ్లు మాత్రమే కాదండోయ్.. ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు!
ప్రసవం తర్వాత తల్లి, బిడ్డల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ వార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఆస్పత్రిలో పనిచేసే పలువురు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఇతర ప్రాంతాలలో డిప్రెషన్ పై పని చేస్తున్నారని తెలుసుకున్న మంత్రి ఆస్పత్రి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిలోనే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గైనిక్, జనరల్ సర్జన్, స్టాఫ్ నర్సుల కొరతను తీరుస్తామని ఆయన ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు.
ఇంతకుముందే ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 నైస్ నియోటెక్ వార్మర్లను, 10 నియో ఫోటో తెరఫీ సింగిల్ సర్ఫేస్ యూనిట్లను, 10 ఆకాష్ సైరింగ్ పంపులను, 5 నెల్ కార్ పల్స్ ఆక్సీమీటర్లను, 2 ట్రాన్స్క్యూటేనియస్ బిలురుబినేటర్లు, 100 మిట్టెన్స్, 100 బూటీలు, 200 స్వద్దే బ్లాంకెట్లు, 4 బబుల్ సీపీఏపీ కంప్రెసర్లు, మూడు నియోనటల్ రెస్క్యూటేషన్ కిట్లు, నాలుగు ఎన్ఐబీపీ యూనిట్లు, 13 లీటర్ల ఆటోక్లేవ్, 4 రూమ్ టెంపరేచర్ థర్మామీటర్లు అందించిన మంత్రి ఈ రోజు ఆంటినేటల్ వార్డ్ ను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఎంహెచ్ఓ డాక్టర్ పొట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిజిహెచ్ ఇన్చార్జి సూపరింటిండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ వందన, డాక్టర్ స్వరూపా రాణి, తదితరులు ఉన్నారు. అనంతరం మంత్రి స్థానిక ఐటీఐలో నిర్మాణంలో ఉన్న ఏటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.