హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.
- Author : Vamsi Chowdary Korata
Date : 16-04-2026 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
LPL Financial అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 సంస్థ ‘ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్’ తన మొట్టమొదటి అంతర్జాతీయ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో 1500 మంది టెకీలను నియమించుకోనుంది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 450కి పైగా జీసీసీలు ఉండగా.. ఎల్‌పీఎల్ రాకతో నగరం గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్‌గా మరింత బలోపేతం కానుంది.
హైదరాబాద్ మహానగరం గ్లోబల్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్‌గా మరో ఘనతను సాధించింది. ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ అమెరికా వెలుపల తన మొట్టమొదటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. అత్యాధునిక సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేషన్లను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సంస్థ నగరంలో భారీగా పెట్టుబడి పెడుతోంది. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఐదు అంతస్తుల్లో సుమారు 3 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ కార్యాలయాన్ని ఓపెన్ చేసింది. రానున్న కొన్ని రోజుల్లో ఈ కేంద్రం ద్వారా 1500 మందికి పైగా నిపుణులను నియమించుకోవాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ 2027 ప్రారంభం నాటికి తన శాశ్వత కార్యాలయంలోకి మారనుంది. ఈ ఏడాది చివరి నాటికి 680 నుండి 700 మంది ఉద్యోగులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు.. హైదరాబాద్ ప్రస్తుతం సుమారు 450 జీసీసీలకు నిలయంగా మారిందని చెప్పారు. ఇవి 1.3 లక్షల అత్యున్నత స్థాయి సాంకేతిక ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. కేవలం గత ఏడాది కాలంలోనే 80 కొత్త జీసీసీలు నగరానికి రావడం విశేషమని ఆయన వెల్లడించారు. ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ వంటి ఫార్చ్యూన్ 500 సంస్థ రాకతో హైదరాబాద్ స్థానం ప్రపంచ ఆర్థిక సేవల రంగంలో మరింత పదిలమైందని మంత్రి కొనియాడారు.
ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ సీటీవో గ్రెగ్ గేట్స్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడి అద్భుతమైన టాలెంట్ అని స్పష్టం చేశారు. ఈ కేంద్రం టెక్నాలజీ, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డేటా అనలిటిక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో అమెరికా కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తుందని ఎల్‌పీఎల్ ఇండియా హెడ్ రమేష్ కాజా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 32 వేల మంది అడ్వైజర్లకు సేవలందిస్తూ.. సుమారు 2.4 ట్రిలియన్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తున్న ఈ సంస్థకు హైదరాబాద్ కేంద్రం అత్యంత కీలకం కానుందని చెప్పారు.