KTR: చంద్రబాబు పనితీరును కొనియాడిన కేటీఆర్
- Author : Vamsi Chowdary Korata
Date : 16-07-2026 - 3:20 IST
Published By : Hashtagu Telugu Desk
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. రాష్ట్రంలో ఎన్నటి పరిస్థితులను ముందే గమనించి, నీళ్ల సమస్య రాకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారని చెప్పారు. కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని, అలాగే సముద్రంలోకి పోయే నీటి వినియోగానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. రైతులు, ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంటలను ఎండబెడుతోందని కేటీఆర్ అన్నారు. ఏపీ ప్రభుత్వం ద్వారా గోదావరి నీటిని తరలించి రైతులకు అండగా ఉందని, ఏపీని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని అన్నారు. కేంద్రం టీడీపీపై ఆధారపడటంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోగలిగారని అన్నారు. కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని నిర్ణయించిన సమయంలోనూ, తమకు సంబంధం లేకపోయినా సరే స్పందించామని అన్నారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా కాపాడటానికి మద్దతు పలికామని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఉందని, అందుకే కాపాడాలని కోరామని అన్నారు. మళ్లీ స్టీల్ ప్లాంట్ ట్రాక్‌లోకి వచ్చిందని పలికారు.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ తరహాలోనే ఆదిలాబాద్‌లోని సీసీఐని పునరుద్ధరించాలని కేటీఆర్ అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన కారణంగానే తెలంగాణకు నష్టం జరుగుతుంటే, కేంద్రం టీడీపీపై ఆధారపడటం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరుగుతోందని అన్నారు. బీఆర్ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో 15 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే ఢిల్లీ తమ కాళ్ల దగ్గరకు వస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని మేడిగడ్డ విషయంలో ఎన్డీఎస్‌ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) తీరుపై కేటీఆర్ స్పందించారు. రెండు రోజులు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్డీఎస్‌ఏ అధికారుల్ని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికకు, తుది నివేదికకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు.
ఎన్డీఎస్‌ఏ గతంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే పట్టించుకోలేదని, కానీ మేడిగడ్డ పిల్లర్ కుంగితే మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇవ్వలేదని, ఎన్డీఏ నివేదిక ఇచ్చిందని అన్నారు. మేడిగడ్డపై ఉన్న శ్రద్ధ మిగతా రాష్ట్రాలపై ఎందుకు లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై పగబట్టినట్లుగా ఉన్నారని, తెలంగాణ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని కోరారు. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను తలవని రోజు లేదని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదని కేటీఆర్ అన్నారు.