Korutla Deepthi Case : దీప్తిని చంపింది చెల్లెలు, ఆమె ప్రియుడే.. వివరాలు వెల్లడించిన పోలీసులు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి హత్యకేసు(Deepthi Case) నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
- Author : News Desk
Date : 02-09-2023 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి హత్యకేసు(Deepthi Case) నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితులు దీప్తి చెల్లెలు చందన, ఆమె ప్రియుడు ఉమర్ అని తెలిపారు. శనివారం జగిత్యాల(Jagtial) జిల్లా ఎస్పీ భాస్కర్(SP Bhaskar) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “దీప్తి చెల్లెలు బంక చందన 2019లో హైదరాబాద్ లో ఓ ఇంజినీరంగ్ కాలేజీలో బీటెక్ జాయిన్ అయింది. రెండేళ్ల తర్వాత డిటెయిన్ అయింది. అదే కాలేజీలో చదివిన హైదరాబాద్ కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ తో చందనకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకోవాలనుకునేంత వరకూ వచ్చింది.
ఆగస్టు 19న ఉమర్ కోరుట్ల వచ్చి చందనతో పెళ్లి విషయం మాట్లాడాడు. ఇద్దరం ఇంకా సెటిల్ అవ్వలేదు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలని చెప్పడంతో తమ ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం తెస్తానని చెప్పింది. 28న ఇంట్లో తను, అక్క మాత్రమే ఉన్నామని వెంటనే కోరుట్లకు రావాలని చెప్పింది. పథకం ప్రకారం దీప్తికోసం వోడ్కా, బ్రీజర్ తెప్పించిన చందన అక్కతో కలిసి వోడ్కా తాగి పడుకుంది. దీప్తి పూర్తిగా నిద్రపోయాక ఉమర్ కు ఫోన్ చేయగా ఇంటికి వెళ్లాడు. చందన, ఉమర్ కలిసి ఇంట్లోని బీరువాలో ఉన్న నగదు, బంగారం తీస్తుండగా దీప్తి చూసి కేకలు వేసింది. దీప్తి గట్టిగా అరవకుండా ఆమె మెడకు చున్నీ వేసి వెనక్కి లాగారు. అయినా కేకలు పెట్టడంతో ఇద్దరూ గట్టిగా పట్టుకుని ముఖానికి చున్నీ చుట్టి నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేశారు. 10 నిమిషాల తర్వాత దీప్తి కదలడం ఆగిపోయింది.
ఇంట్లో ఉన్న రూ.1.20 లక్షల నగదు, 70 తులాల బంగారంతో ఉమర్, చందన కలిసి పారిపోయారు. వెళ్లిపోయే ముందు దీప్తికి చుట్టిన చున్నీ, ప్లాస్టర్ తీసేసి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళ్లిన వారిద్దరూ నాగ్ పూర్ లో స్థిరపడాలని బయల్దేరగా ఆర్మూర్ రోడ్డులో శనివారం (ఆగస్టు2) ఉదయం పోలీసులకు పట్టుబడ్డారు. దీప్తి హత్యకేసులో ఏ1గా చందన, ఏ2గా హైదరాబాద్ ప్రగతి నగర్ కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్, తల్లి సయ్యద్ అలియా, షేక్ అసియా ఫాతిమా, హఫీజ్ ను అరెస్ట్ చేసి.. నిందితుల నుంచి నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం” అని ఎస్పీ భాస్కర్ వివరించారు.
Also Read : Horrible Incident : భార్యను నగ్నంగా ఊరేగించిన కిరాతక భర్త !