KCR Seasonal Politician: కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్.. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు: మంత్రి
తెలంగాణ ప్రజలు కష్టపడి కేసీఆర్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, ఆయన ఏనాడు ప్రజాతీర్పును గౌరవించలేదు. అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు.
- By Gopichand Published Date - 07:32 PM, Wed - 19 February 25

KCR Seasonal Politician: ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్ దాటని దొరవారు అధికారంపై పగటికలలు కంటున్నారని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోగానే తనకు పదేళ్లు అధికారం కట్టబెట్టిన ప్రజలను మరిచి అజ్ఞాతంలోకి వెళ్లిన కేసీఆర్‌కి, 14 నెలలుగా కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ది ఏ విధంగా కనబడుతుందన్నారు. కేసీఆర్ (KCR Seasonal Politician) ఒక సీజనల్ పొలిటీషియన్, ఎన్నికలప్పుడు మాత్రమే ఆయనకు ప్రజలు గుర్తుకొస్తారు. 14 నెలల నుంచి ఫాంహౌస్ దాటని ఆయన స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
పొంగులేటి ఏమన్నారంటే?
మేడిగడ్డ కుంగినప్పుడు గానీ, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు గానీ ఆయనకు ప్రజలు గుర్తుకురాలేదు. శాసనసభలో కీలకమైన తీర్మానాలు, కులగణన, ఎస్సీవర్గీకరణ, భూభారతి బిల్లు, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి కూడా కేసీఆర్ హాజరుకాలేదు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సైతం గైర్హాజరయ్యారు.
Also Read: Pakistan vs New Zealand: పాక్ బౌలర్లను చిత్తు చేసిన కివీస్ ఆటగాళ్లు.. రెండు సెంచరీలు నమోదు!
తెలంగాణ ప్రజలు కష్టపడి కేసీఆర్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, ఆయన ఏనాడు ప్రజాతీర్పును గౌరవించలేదు. అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షనేత అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. కానీ కేసీఆర్ గారు తాను ప్రజలు జవాబుదారీగా లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన అసెంబ్లీకి వస్తే ఆయన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఏవిధంగా తిరోగమనదిశలోకి తీసుకెళ్లారు. పదేళ్లలో ఆయన చేసిన నిర్వాకాలను తప్పులను ఒక్కోక్కటిగా సరిచేసుకుంటూ 14నెలల్లో తాము సాధించిన అభివృద్దిని సవివరంగా కేసీఆర్ ముందుంచుతాం.
కాంగ్రెస్ భవిష్యత్ గురించి కాకుండా ముందుగా కేసీఆర్ తన భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుంటుంది. కేసీఆర్ భవిష్యత్తుపై గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. పార్లమెంటు తీర్పే భవిష్యత్తులో ఉంటుంది. విపరీతమైన అప్పులు చేసి నెత్తినమీద మిత్తిల భారం పెట్టిపోయారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులకు తెలంగాణ సమాజం ఆయనను ఎన్నటికీ క్షమించదు. నువ్వు వద్దు, నీ పాలన వద్దూ మహాప్రభో అని తెలంగాణ ప్రజలు వదిలించుకున్నా ఇంకా వదిలేది లేదన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉందని పేర్కొన్నారు.