Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం.. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు?
మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేవలం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
- By Gopichand Published Date - 03:44 PM, Wed - 29 October 25
Telangana Cabinet: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వ్యూహంలో భాగంగా మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి (Telangana Cabinet) తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మైనారిటీ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గంలో మైనారిటీ వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య విజయాన్ని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పరోక్షంగా ఎంఐఎం (MIM) మద్దతు కూడగట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర నాయకత్వం ఈ ఉపఎన్నికలో మైనారిటీల సంపూర్ణ మద్దతు తమకే దక్కాలని భావిస్తోంది.
Also Read: Jahnavi Swaroop : సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!
మంత్రివర్గ విస్తరణలో అజారుద్దీన్‌కు అవకాశం
తాజా పరిణామాల ప్రకారం.. మైనారిటీ వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఎమ్మెల్సీ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే అది జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓటర్లపై బలమైన సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అందిన సమాచారం ప్రకారం.. ఈ నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఉపఎన్నికలపై ప్రభావం
మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేవలం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం, పార్టీ పట్ల మైనారిటీ వర్గంలో విశ్వాసాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందని నాయకులు భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక అడుగులు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి. ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ, మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ పెట్టిన ప్రత్యేక దృష్టి, ఈ ఉపఎన్నిక ప్రాముఖ్యతను మరింత పెంచింది.