TRS vs BJP: వరి వర్రీ గులాబీకా? కమలానికా? దేని రెక్కలు తెగనున్నాయి?
వచ్చేస్తోంది. ఇన్నాళ్లూ వస్తుంది వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు వచ్చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ మొదలైపోయింది. ఏదైతే.. తెలంగాణలో రాజకీయాల హీట్ ను పెంచిందో.. ఏదైతే బీజేపీ పోరాటానికి మూలంగా ఉందో..
- By Hashtag U Published Date - 11:24 AM, Sun - 10 April 22

వచ్చేస్తోంది. ఇన్నాళ్లూ వస్తుంది వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు వచ్చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ మొదలైపోయింది. ఏదైతే.. తెలంగాణలో రాజకీయాల హీట్ ను పెంచిందో.. ఏదైతే బీజేపీ పోరాటానికి మూలంగా ఉందో.. ఏదైతే గులాబీ అధినేత వాయిస్ ను పెంచిందో.. అదే.. వరి. ఇది టీఆర్ఎస్, బీజేపీ.. రెండింటిలోనూ వర్రీని పెంచుతోంది. యాసంగిలో వచ్చిన వరిని మార్కెట్ చేయడం కష్టం. అందుకే ఆ బాధ్యతను ఒకరిపై మరొకరు నెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కానీ వీళ్లు వాదులాడుకునేలోపే మార్కెట్లోకి వరి వస్తోంది. కానీ గోదాములు చూస్తే.. ఆ స్థాయిలో లేవు. మరి రైతుకు ఏమిటి దారి?
ఇంకో నెలరోజుల్లో దాదాపు 78 లక్షల టన్నుల ధాన్యం మార్కెట్లోకి రాబోతోంది. దీంతోపాటు 20 లక్షల టన్నుల మొక్కజొన్నలు, 2 నుంచి 4 లక్షల టన్నుల ఇతర పంటలు కూడా అమ్మకానికి వస్తాయి. కానీ వీటన్నింటినీ నిల్వచేయడానికి సరిపడా గోడౌన్లు మాత్రం లేవు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటివరకు 20.18 లక్షల టన్నుల పంటను మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. మరి మిగిలిన ఉత్పత్తి సంగతేంటి? కిందటేడాది అంటే ఫంక్షన్ హాళ్లు కాపాడాయి. కరోనా వల్ల అవి ఖాళీగా ఉండడంతో వాటిలో పంటను నిల్వచేశారు. కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. ఈ రెండు నెలలూ పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి.
తెలంగాణలో పంట ఉత్పత్తిని దాచుకోవడానికి సరిపడా గోడౌన్లే లేవా? ఎందుకు లేవు భేషుగ్గా ఉన్నాయి. అసలు రాష్ట్రం ఏర్పడేనాటికే 39 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోడౌన్లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడైతే ఆ స్థాయి 72.64 లక్షల టన్నులకు పెరిగింది. అయినా ఇది సరిపోదు. ఎందుకంటే వీటిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు ఉన్న నిల్వ సామర్థ్యం కేవలం 6.93 లక్షల టన్నులు. ఈ సంస్థ ఇతర చోట్ల సేకరించిన నిల్వసామర్థ్యం 29.50 లక్షల టన్నులు. ఇవి కాకుండా మిగిలినవి ప్రైవేటు సంస్థలవి. ఇలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి వీలుగా ప్రభుత్వం నిర్మించిన కొత్త గోడౌన్ల సామర్థ్యం కేవలం మూడు లక్షల టన్నులే. ఇవి ఇంకా అందుబాటులోకి రావాలి.
ప్రైవేటు సంస్థల గోడౌన్ల సామర్థ్యం చూసినా ఇంకో 17 లక్షల టన్నులు ఉండొచ్చు. మరి మార్కెట్లోకి వచ్చే ధాన్యం, మిల్లుకి వెళ్లాక వచ్చే బియ్యం, వేరుసెనగ, మొక్కజొన్న.. ఇవన్నీ వచ్చాక ఎక్కడ నిల్వ చేయాలో ప్రభుత్వానికి అంతుబట్టడం లేదు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే.. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కోటి టన్నుల పంటను నిల్వ చేయడం కష్టం. అంటే రాష్ట్రంలో కచ్చితంగా కోటి టన్నుల పంటను నిల్వచేయడానికి సరిపడా గోడౌన్లు కావాలి. ఇక ఇప్పుడున్న పరిస్థితులకు తోడు.. జూన్ నుంచి ప్రారంభం అయ్యే పంటల సీజన్ కోసం ఐదు లక్షల టన్నుల ఎరువులను ఎక్కడ నిల్వ చేయాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. దీనికితోడు ప్రైవేటు వ్యాపారులకు మరో ఐదు లక్షల టన్నుల ఎరువుల కోసం గోడౌన్లు అవసరం. మరి వీటన్నింటినీ ఎక్కడ నిల్వ చేస్తారు?
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య క్లారిటీ రావడం లేదు. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక చాలామంది రైతులు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కానీ దీనివల్ల మద్దతుధర కూడా వారికి గిట్టుబాటు కావడం లేదు. మద్దతు ధర క్వింటాకు రూ.1940 ఉంటే.. మిల్లర్లు కేవలం రూ.1450 ఇస్తున్నారు. అంటే క్వింటాకు దాదాపు రూ.400 మేర రైతుకు నష్టం వస్తోంది. పైగా తేమ ఉందని, నూకలు ఎక్కువుంటాయంటూ తరుగు కింద ఐదు క్వింటాలను పక్కనపెడుతున్నారు. ఇదంతా అన్యాయం అని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు రైతులు.
ప్రభుత్వం ధాన్యం కొంటుంది అన్న భరోసా లేకపోవడం వల్లే రైతులు నష్టమైనా సరే వ్యాపారులకు పంటను అమ్మేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం మదిలో అలాంటి ఆలోచన ఉన్నా.. ఢిల్లీలో ధర్నా కార్యక్రమం, ఆ తరువాత క్యాబినెట్ మీటింగ్, ఆ తరువాత నిర్ణయం ప్రకటన ఉండొచ్చు. ఇదంతా జరిగేసరికి కనీసం వారం రోజులు పడుతుంది. కానీ ఆలోపు రాష్ట్రంలో వరికోతలు కొంత పూర్తవుతాయి. ఆ సమయానికల్లా రైతులు దాదాపు 2 లక్షల టన్నుల మేర ధాన్యాన్ని మిల్లర్లకు అమ్మేస్తారు. అంటే మొత్తం 5 లక్షల టన్నుల మేర అమ్మకాలు చేసినట్టు అవుతుంది. వీటికి మద్దతు ధర లేదు కాబట్టి.. రైతులు దాదాపు రూ.230 కోట్లు నష్టపోయినట్టే. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, రైతులను ఎలా ఆదుకుంటుందో చూడాలి.