TGPSC: రేపు గ్రూప్- 2 తుది ఫలితాలు విడుదల?
మరోవైపు TGPSC నియామక ప్రక్రియలో వేగాన్ని ప్రదర్శిస్తూ ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్లోని ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.
- By Gopichand Published Date - 07:50 PM, Sat - 27 September 25

TGPSC: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అత్యంత ముఖ్యమైన ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గ్రూప్-2 తుది ఫలితాలను రేపు విడుదల చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా కమిషన్ దసరా పండుగలోపు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించాలనే లక్ష్యంతో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేసింది.
గ్రూప్-2 ప్రక్రియ- కీలక మైలురాళ్లు
గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 783 పోస్టుల భర్తీకి కమిషన్ 2022లోనే ప్రకటన జారీ చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించగా.. 2025 మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను TGPSC విజయవంతంగా పూర్తి చేసింది.
Also Read: High Court: నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తే నష్టమేంటి?: హైకోర్టు
అన్ని పత్రాల పరిశీలన పూర్తవడంతో రేపు తుది ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నియామక ప్రక్రియ దసరా నాటికి పూర్తయితే ఏళ్ల తరబడి గ్రూప్-2 కోసం శ్రమించిన దాదాపు 783 మంది అభ్యర్థుల కల సాకారమవుతుంది.
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాల విడుదల
మరోవైపు TGPSC నియామక ప్రక్రియలో వేగాన్ని ప్రదర్శిస్తూ ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్లోని ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది. మొత్తం 181 పోస్టుల భర్తీకిగాను.. 176 మంది అభ్యర్థుల వివరాలను ఎంపిక చేసి కమిషన్ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. TGPSC ఛైర్మన్ బుర్ర వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు. మిగిలిన పోస్టులకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాల విడుదల.. గ్రూప్-2 తుది ఫలితాల కోసం చేస్తున్న సన్నాహాలు.. రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైందనడానికి నిదర్శనం. నియామక పత్రాలు దసరాలోపు అందించాలనే లక్ష్యంతో కమిషన్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.