Mother Kidnapped : కొడుకు అప్పు తీర్చడం లేదని.. తల్లిని కిడ్నాప్ చేసిన కాంట్రాక్టర్
దీనిపై ఇటీవల పలుమార్లు లాల్ దేవకర్, శ్రీనివాస్ మధ్య వాగ్వాదం(Mother Kidnapped) జరిగింది.
- Author : Pasha
Date : 07-11-2024 - 4:15 IST
Published By : Hashtagu Telugu Desk
Mother Kidnapped : కొడుకు అప్పు తిరిగి కట్టడం లేదని.. అతడి తల్లిని మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ కిడ్నాప్ చేయించాడు. ఈ దారుణ ఘటన బుధవారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అర్బన్ మండలం కొడుముంజలో చోటుచేసుకుంది.
Also Read :Anil Ambani : అనిల్ అంబానీకి బిగ్ షాక్.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్లు బ్యాన్
కొడుముంజ గ్రామానికి చెందిన చెందిన పల్లపు శ్రీనివాస్ బండ పని మేస్త్రీగా పనిచేస్తుంటాడు. మహారాష్ట్రకు చెందిన లాల్ దేవకర్ ఒక కాంట్రాక్టర్. అతడు మహారాష్ట్ర, కర్ణాటకలలో చెరుకు కోత పనుల కాంట్రాక్టులు తీసుకుంటుంటాడు. ఈక్రమంలో లాల్ దేవకర్‌ను కలిసిన పల్లపు శ్రీనివాస్.. తన దగ్గరున్న ఛత్తీస్‌గఢ్ కూలీలతో చెరుకు కోత పనులు చేయిస్తానంటూ రూ.3.80 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే డబ్బులు తీసుకున్నాక పల్లపు శ్రీనివాస్ మాట మార్చాడు. లాల్ దేవకర్‌కు సంబంధించిన చెరుకు కోత పనుల కోసం కూలీలను కర్ణాటకకు పంపడం ఆపేశాడు. తాను కూడా మొహం చాటేశాడు. దీనిపై ఇటీవల పలుమార్లు లాల్ దేవకర్, శ్రీనివాస్ మధ్య వాగ్వాదం(Mother Kidnapped) జరిగింది. తన డబ్బులు తనకు ఇచ్చేయాలని లాల్ దేవకర్ అడిగాడు.
Also Read : Shah Rukh Khan : షారుక్ ఖాన్‌కు హత్య బెదిరింపు.. దుండగుడు ఎవరు అంటే..?
ఈక్రమంలోనే దేవకర్ అనుచరులు బుధవారం ఉదయం కొడుముంజ గ్రామానికి చేరుకున్నారు. స్థానికంగా ఒక ఎస్‌యూవీ వాహనాన్ని అద్దెకు మాట్లాడుకున్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉన్న పల్లపు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి.. అతడి భార్య, కుటుంబసభ్యులపై దాడి చేశారు. శ్రీనివాస్ భార్యను కిడ్నాప్ చేసి, తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. దీంతో అక్కడే ఉన్న పల్లపు శ్రీనివాస్ తల్లి పల్లపు బీమాబాయిని బలవంతంగా కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్లారు. డబ్బులిచ్చి తమ దగ్గరి నుంచి బీమాబాయిని తీసుకెళ్లాలని కిడ్నాపర్లు చెప్పడం గమనార్హం. ఇదంతా జరిగిన టైంలో శ్రీనివాస్ అక్కడ లేడు. తల్లి కిడ్నాప్ జరిగిన అనంతరం అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. మహారాష్ట్రలోని కాంట్రాక్టర్ లాల్ దేవకర్ గ్రామానికి ప్రత్యేక టీమ్‌ను పంపారు.