Kavithas Letter Issue : కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కవిత లేఖపైనే ప్రధాన చర్చ
కొడుకు, కూతురులలో పార్టీపరంగా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో తేల్చుకోలేని ఒత్తిడిలో ప్రస్తుతం కేసీఆర్(Kavithas Letter Issue) ఉన్నారని విశ్లేషిస్తున్నారు.
- By Pasha Published Date - 03:58 PM, Sun - 25 May 25

Kavithas Letter Issue : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కల్వకుంట్ల కవిత రాసిన లేఖ మీడియాకు లీకైన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు (ఆదివారం) బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కవిత లేఖ గురించే చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కవిత విషయంలో పార్టీ తరఫున ఎలా స్పందించాలి ? ఆమె వ్యాఖ్యలను పార్టీపరంగా ఎలా పరిగణించాలి ? అనే దానిపై కేసీఆర్ నుంచి దిశానిర్దేశం పొందేందుకే కేటీఆర్ ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఎటూ తేల్చలేక.. ఒత్తిడిలో కేసీఆర్ ?
ఇటీవలే లేఖ రాసినందుకు కవితపై పార్టీపరమైన క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలా ? వద్దా ? అనే దానిపైనా కేసీఆర్‌తో కేటీఆర్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే తన కుమార్తె కవితపై పార్టీపరమైన చర్యలకు కేసీఆర్ ఒప్పుకునే అవకాశం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కొడుకు, కూతురులలో పార్టీపరంగా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో తేల్చుకోలేని ఒత్తిడిలో ప్రస్తుతం కేసీఆర్(Kavithas Letter Issue) ఉన్నారని విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గాలను క్రియేట్ చేసేలా కవిత వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో కేటీఆర్ ఉన్నారని, అదే విషయాన్ని కేసీఆర్‌కు సూటిగా తెలియజేస్తారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న నిర్వహించబోయే కార్యక్రమాలపైనా కేసీఆర్‌తో కేటీఆర్ చర్చించే అవకాశముంది.
Also Read :Kavitha Politics : కవిత కొత్త పార్టీ పెడితే.. ఏ పార్టీకి లాభం ? ఏ పార్టీకి నష్టం ?
బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా.. కవిత అభిమానుల కార్యక్రమాలు
‘‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’’ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై ఇటీవలే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం ఓసారి గుర్తు చేసుకోవాలి. ‘‘పార్టీ అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకోవచ్చు. కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుంది’’ అని కేటీఆర్ చెప్పారు. ఇవాళ కేసీఆర్‌తో జరిగిన భేటీలోనూ ఇదే అంశాన్ని కేటీఆర్ లేవనెత్తి ఉండొచ్చు. ఇటీవలే మీడియాతో మాట్లాడే క్రమంలో కేటీఆర్ ఆచితూచి పదాలను వాడారు. ఎక్కడా కవిత అనే పేరును వాడలేదు. మరోవైపు కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగగానే.. ఆమె అభిమానులు టీమ్ కవితక్క అనే పోస్టర్లను ప్రదర్శించారు. కవిత సీఎం అంటూ నినాదాలు చేశారు. కవిత అభిమానులు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ జెండా కానీ, బీఆర్ఎస్ ఇతర నాయకుల ఫోటోలు కానీ ప్రదర్శించలేదు. ఈ రెండు రకాల అంశాలు.. భవిష్యత్తులో బీఆర్ఎస్‌లో జరగబోయే ‘కొత్త’ పరిణామాలకు బలమైన సంకేతాలుగా నిలుస్తున్నాయి.