Kavitha Politics : కవిత కొత్త పార్టీ పెడితే.. ఏ పార్టీకి లాభం ? ఏ పార్టీకి నష్టం ?
బీసీ రిజర్వేషన్లు, బీసీ సంక్షేమం, మహిళా రిజర్వేషన్లు, మహిళా సంక్షేమం వంటి ప్రధాన అంశాలపై ఫోకస్‌తో కవిత(Kavitha Politics) రాజకీయ పార్టీ ముందుకుపోతుందని అంటున్నారు.
- By Pasha Published Date - 02:35 PM, Sun - 25 May 25

Kavitha Politics : బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యం లభించే అవకాశాలు లేనందున, కొత్త రాజకీయ పార్టీని పెట్టడానికి కల్వకుంట్ల కవిత రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకొన్ని నెలల పాటు వేచిచూసే ధోరణిని అవలంభించాలని కవిత అనుకుంటున్నారట. అప్పట్లోగా తనకు బీఆర్ఎస్‌లో కేటీఆర్‌తో సమ స్థాయి కలిగిన పోస్టు దక్కకుంటే.. ఇక ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసే అవకాశాలు ఉంటాయని పలువురు అంటున్నారు. కేసీఆర్ సైతం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌లో కవితకు కేటీఆర్‌తో సమానమైన హోదాను ఇచ్చేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు కవిత దూరం కాకూడదనే ఉద్దేశంతో, ఆమెకు కీలకమైన పార్టీ బాధ్యతలను అప్పగించే ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఇందుకు భిన్నంగా పరిణామాలు జరిగితే మాత్రం.. బీఆర్ఎస్‌లో కవిత కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
Also Read :House Warming : చంద్రబాబు ఫ్యామిలీ గృహప్రవేశం.. అతిథులకు అద్భుతమైన వంటకాలు
కొత్త పార్టీకి ఆదరణ ఎలా ఉంటుంది ?
ఒకవేళ కవిత తన సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుంటే.. ఎలా ఉంటుంది ? ఆ పార్టీకి జనాదరణ ఎంతమేర లభిస్తుంది ? అనే దానిపై అంతటా ఇప్పటి నుంచే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కవిత ఎగ్జిట్ అయితే.. ఆమె వెంట నడిచే నేతలు చాలామందే ఉన్నారట. ఇప్పటికే గ్రౌండ్ లెవల్‌లో తెలంగాణ జాగృతికి కొంత క్యాడర్ ఉంది. తదుపరిగా పలువురు బీఆర్ఎస్ నేతల చేరికతో క్యాడర్ సంఖ్య పెరిగిపోతుంది. బీసీ రిజర్వేషన్లు, బీసీ సంక్షేమం, మహిళా రిజర్వేషన్లు, మహిళా సంక్షేమం వంటి ప్రధాన అంశాలపై ఫోకస్‌తో కవిత(Kavitha Politics) రాజకీయ పార్టీ ముందుకుపోతుందని అంటున్నారు. పలు బీసీ సంఘాల నుంచి కూడా కవితపెట్టే రాజకీయ పార్టీకి మద్దతు లభించే ఛాన్స్ ఉంది. ప్రత్యేకించి బీఆర్ఎస్‌లోని మహిళా ముఖ్య నేతలతో కవితకు మంచి సంబంధాలు ఉన్నాయి. వారిలో పలువురు కవిత పెట్టే పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయి. వచ్చే ఎన్నికల నాటికి క్యాడర్‌ను పెంచుకోగలిగితే.. కవిత రాజకీయ పార్టీ తనదైన ముద్ర వేయగలుగుతుంది. గ్రౌండ్ లెవల్‌లో పార్టీ నిర్మాణంపై పని చేయకుంటే ప్రతికూలతలు ఎదురయ్యే ముప్పు ఉంటుంది.
Also Read :Sirajs Terror Links: రాజాసింగ్ వీడియోకు సిరాజ్ కౌంటర్.. సిరాజ్‌కు ఓ అధికారి ప్రోత్సాహం.. ఎవరతడు ?
ప్రయోజనం.. ఆ పార్టీకే.. ?
బీజేపీ కుట్ర వల్లే తనపై లిక్కర్ స్కాం కేసులను ఈడీ బనాయించిందని గతంలో చాలాసార్లు కవిత ఆరోపించారు. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖలోనూ ఆమె బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీని కేసీఆర్ అంతగా తిట్టలేకపోయారనే అంశాన్ని కవిత ఎత్తి చూపారు. దీన్నిబట్టి బీజేపీపై ఆమెకు ఉన్న వ్యతిరేక భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక వైఖరితో ప్రజల్లోకి కవిత వెళ్లే అవకాశం ఉంది. ఈ వైఖరి వల్ల ఆమె కాంగ్రెస్‌కు దగ్గరయ్యే అవకాశాలు పెరుగుతాయి. కవిత పెట్టే రాజకీయ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ సైతం ఆసక్తిని చూపొచ్చు. అదే జరిగితే బీఆర్ఎస్ సైతం బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధమైపోవచ్చు. కవిత కొత్త రాజకీయ పార్టీ పెడితే.. ప్రధానంగా వలసలు జరిగేది బీఆర్ఎస్ నుంచే. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీజేపీలు కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలను తమవైపు లాక్కునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. దీనివల్ల బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో డీలా పడుతుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.