Telangana Tax Revenue : ఆగస్టులో రూ.13వేల కోట్లు.. తెలంగాణ పన్ను ఆదాయానికి రెక్కలు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో(Telangana Tax Revenue) తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,447 కోట్లు వచ్చాయి.
- By Pasha Published Date - 09:28 AM, Sun - 29 September 24

Telangana Tax Revenue : ఆగస్టు నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆ నెలలో సర్కారుకు ఏకంగా రూ.13వేల కోట్ల పన్ను రాబడి వచ్చింది. అంతకుముందు నెల (జులై)లో పన్ను రాబడి రూ.10వేల కోట్ల లోపే ఉంది. ఈమేరకు ఆదాయ, వ్యయ వివరాలతో కూడిన ఓ నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో ఇప్పటిదాకా అత్యధిక పన్ను రాబడి ఆగస్టు నెలలోనే వచ్చిందని తెలిపింది. జూన్‌లో రూ.12,190 కోట్లు, జులైలో రూ.9,965 కోట్లు మేర పన్నురాబడి వచ్చిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది. జులైతో పోలిస్తే ఆగస్టులో పన్ను రాబడి గణనీయంగా 30శాతానికిపైగా పెరిగిందని రాష్ట్ర సర్కారు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి 5నెలల్లో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) రాష్ట్ర సర్కారుకు వచ్చిన మొత్తం పన్ను రాబడి రూ.57,772 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇది 35శాతం ఎక్కువే.
Also Read :Health Tips : సంతానలేమిని దూరం చేయడానికి ఈ కూరగాయను మించిన ఔషధం లేదు
- తెలంగాణ ప్రభుత్వానికి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.20,500 కోట్ల జీఎస్టీ వసూళ్లతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,390 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.13,487 కోట్లు లభించాయి. ఆబ్కారీ శాఖ నుంచి రూ.7,806 కోట్లు, కేంద్ర పన్నుల నుంచి రూ.6,220 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ.3,316 కోట్లు వచ్చాయి.
- ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.2,21,242 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. అయితేే తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్ – ఆగస్టు) 28శాతం (రూ.61,618కోట్లు) మేర రాబడి ఖజానాలో జమ అయింది.
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో(Telangana Tax Revenue) తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,447 కోట్లు వచ్చాయి. రాష్ట్ర బడ్జెట్‌లో అంచనా వేసిన దానిలో ఇది 11శాతం మాత్రమే.
- ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.50వేల కోట్ల అప్పులు చేయాల్సి వస్తుందని రాష్ట్ర సర్కారు అంచనా వేసింది. అయితే గత ఐదు నెలల్లో రూ.29,449 కోట్ల అప్పులు చేసింది. అంటే అంచనావేసిన దాంట్లో 60 శాతం అప్పును ఇప్పటికే తీసుకున్నారు.
- తెలంగాణ ప్రభుత్వం ఖర్చుల విషయానికి వస్తే.. గత ఐదు నెలల్లో రూ.85,467 కోట్లు ఖర్చు చేసింది. ఉద్యోగుల వేతనాలకు రూ.18,152 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.10,497 కోట్లు, పెన్షన్లకు రూ.11,641 కోట్లు, రాయితీల చెల్లింపులకు రూ.5,398 కోట్లను వెచ్చించింది.
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలాఖరు నాటికి తెలంగాణ రెవెన్యూ లోటు రూ.15,521 కోట్లు, ఆర్థిక లోటు రూ.29,449 కోట్లు, ప్రాథమిక లోటు రూ.18,952 కోట్లు ఉంది.