Weather Updates : అలర్ట్.. ఏపీ, తెలంగాణలో ఐదు రోజులపాటు కుండపోత వర్షాలు
Weather Updates : తెలుగు రాష్ట్రాల ప్రజలు మరికొన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
- By Kavya Krishna Published Date - 12:23 PM, Tue - 9 September 25

Weather Updates : తెలుగు రాష్ట్రాల ప్రజలు మరికొన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం, సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో ఒక కొత్త అల్పపీడనం రూపుదిద్దుకోనుంది. ఈ వాతావరణ వ్యవస్థ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపుగా కదిలే అవకాశం ఉన్నట్లు అంచనా వేయబడింది. దీని ప్రభావంతో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు మరింత విస్తృతంగా పడతాయని అధికారులు తెలిపారు.
GHMC : అల్లు ఫ్యామిలీకి మరో షాక్… జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు..!
రేపటి నుండి 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా వేశారు. కొన్నిచోట్ల కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఈ నెల 14 వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాల్లోని ప్రజలు, రైతులు వర్షాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాలు వర్షాలతో తడిసిపోయాయి. వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ పట్టణంలో అత్యధికంగా 5.92 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఖిల్లా వరంగల్‌లో 5.57 సెం.మీ., గీసుకొండలో 4.50 సెం.మీ. వర్షం కురిసింది. వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు పంట పొలాల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పట్టణాల్లో తక్కువ స్థాయిలో ఉండే ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో, విపత్తు నిర్వహణ విభాగాలు కూడా సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
Nepal: వెనక్కి తగ్గిన నేపాల్ ప్రభుత్వం .. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత