Chamala Kiran : పేదలు బాగుపడాలంటే బీజేపీని తరిమేయాలి.. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్
Chamala Kiran : దేశం నుంచి బీజేపీని తరిమికొడితేనే పేదల జీవితాలు బాగుపడతాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
- Author : Pasha
Date : 27-04-2024 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
Chamala Kiran : దేశం నుంచి బీజేపీని తరిమికొడితేనే పేదల జీవితాలు బాగుపడతాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక .. అనేక సంక్షేమ పథకాలు నిర్వీర్యం అయ్యాయని ఆయన తెలిపారు. పేదలకు ప్రతి సంవత్సరం 100 రోజుల పనిదినాలను కల్పించే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం ఇప్పుడు నీరుగారడానికి ప్రధాన కారణం మోడీ సర్కారే అని విమర్శించారు. మునుగోడులోని మర్రిగూడలో జరిగిన రోడ్ షో లో ఆయన మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో కొనసాగితే అదానీలు, అంబానీల సంపద పెరుగుతుందే తప్ప పేదలకు ఒరిగేదేమీ ఉండదని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పేదల సంక్షేమాన్ని కోరుకునే కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణను అప్పుల ఊబిలో ముంచిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran) ఆరోపించారు. తెలంగాణకు ప్రస్తుతం 9 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి కేసీఆర్ సర్కారు భారీగా అప్పులు చేసిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే.. నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం తగిన విధంగా కృషి చేస్తానని కిరణ్ హామీ ఇచ్చారు. ఈ ర్యాలీలో చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఇన్‌ఛార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మునుగోడు నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను నాలుగేళ్లలోగా పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెడతా’’ అని చెప్పారు. ‘‘పదేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి నెట్టింది. కేవలం ఆయన కుటుంబమే బాగుపడింది. అందుకే కవిత జైల్లోకి వెళ్లింది’’ అని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి అక్రమాలకు ప్రతిఫలంగా రానున్న రోజుల్లో వాళ్లకు జైలు కూడు తప్పదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కును తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం, వృద్ధాప్య వితంతువులకు పెన్షన్లు అందజేస్తామని తెలిపారు. తనను ఆదరించినట్టే చామల కిరణ్ కుమార్ రెడ్డి ని కూడా ఆదరించి మునుగోడు లో లక్ష మెజార్టీ ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.