BJP MLC Candidate : రసవత్తరంగా ఎమ్మెల్సీ బై పోల్.. బీజేపీ అభ్యర్థి ఎవరు ?
BJP MLC Candidate : ఓ వైపు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే.. మరోవైపు వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కసరత్తు మొదలైంది.
- By Pasha Published Date - 08:27 AM, Sat - 27 April 24

BJP MLC Candidate : ఓ వైపు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే.. మరోవైపు వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కసరత్తు మొదలైంది. మే 2న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకానుండగా.. మే 9 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న ఫలితాలు వస్తాయి. ఈ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ కుమార్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. ఇక బీఆర్‌ఎస్ నుంచి వాసుదేవరెడ్డి, రాకేష్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా ఎమ్మెల్సీ బై పోల్‌లో సత్తాచాటాలని భావిస్తోంది. ప్రస్తుతం అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీజేపీకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్సీని పట్టభద్రుల స్థానం నుంచి గెలిపించుకోవాలని కాషాయ పార్టీ పావులు కదుపుతోంది.
We’re now on WhatsApp. Click to Join
పార్టీ అవకాశమిస్తే వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్‌లో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి భావిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు ఎమ్మెల్సీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ అధిష్ఠానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డిలలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎమ్మెల్సీ టికెట్ విషయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నుంచి భరోసా లభించినట్లు సమాచారం. ఇదే విషయమై కిషన్ రెడ్డిని ఆరా తీయగా, ప్రకాశ్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తే తప్పేముందన్నారు. దీంతో టికెట్ దాదాపు ఆయనకే దక్కొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. కిషన్ రెడ్డికి సన్నిహితుడు కావడం ప్రకాశ్ రెడ్డికి కలిసొచ్చే అంశం.
Also Read :Earth Quakes : తైవాన్‌లో మరో రెండు భూకంపాలు.. అర్ధరాత్రి ఏమైందంటే..
గతంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మరోసారి తనకే టికెట్ దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఈసారి తనకు సానుభూతి కలిసి వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్గొండ జిల్లాకు చెందిన విద్యావంతుడు కాసం వెంకటేశ్వర్లు సైతం ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. గతంలో ఈయన ఆలేరు అసెంబ్లీ టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. ఇటీవల భువనగిరి లోక్‌సభ టికెట్ ఆశించినప్పటికీ అది కూడా దక్కలేదు. దీంతో ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని బీజేపీ పెద్దలను కాసం వెంకటేశ్వర్లు కోరుతున్నారు. వాస్తవానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉండేవారు. ఆయనకు ఇంకా పదవీకాలం మిగిలే ఉంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి పోటీచేసి గెలిచారు. ఎమ్మెల్సీ పదవికి పల్లా రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది.