Ganesh Utsav: గణేష్ ఉత్సవాలపై కఠిన ఆంక్షలు.. డీజే లు లేవు మైకులు బంద్ అంటూ!
తెలంగాణ ప్రభుత్వం వినాయక చవితికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా పోలీసు శాఖ వారు కొన్ని తట్టిన ఆంక్షలను విధించారు
- By Anshu Published Date - 12:00 PM, Fri - 30 August 24

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. దాదాపు తొమ్మిది రోజుల పాటు ఈ వినాయకుడికి పూజలు చేస్తూ ఈ తొమ్మిది రోజులు స్వామివారికీ ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఇక తొమ్మిది రోజుల తర్వాత స్వామివారి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇక వినాయక చవితి వచ్చింది అంటే చాలు ఆటలు పాటలు డీజేలు డప్పులు మొదలు, కోలాహలంగా ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి పండుగకు పెద్దపెద్ద డీజేలు పెట్టి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా డాన్సులు చేస్తూ ఉంటారు. ఇక మరొక ఎనిమిది రోజుల్లో వినాయక చవితి పండుగ రానుంది.ఇప్పటికే కొన్ని చోట్ల మండపాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇంకా కొన్ని ప్రదేశాలలో అయితే దూర నుంచి గణనాధులను ముందుగానే తెచ్చి మండపాలలో ఏర్పాటు చేసేసారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతి గల్లీలో వినాయక మండపం ఏర్పాటు కానుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం వినాయక చవితికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా పోలీసు శాఖ వారు కొన్ని తట్టిన ఆంక్షలను విధించారు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్సవాల సమయంలో ఎలాంటి ఘర్షణలు, వివాదాలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా కొన్ని తప్పనిసరి చేసింది. మండపం ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలను పోలీస్ శాఖ వెల్లడించింది.
నిర్వాహకులు మండపం ఏర్పాటుకు పాటించాల్సిన సూచనలు, జాగ్రత్తలు వివరిస్తూనే అనుమతి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు ప్రకటించారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా మండపం ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండపం ఏర్పాటుకు దరఖాస్తుల తేదీని తెలిపింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు https://www.tspolice.gov.in వెబ్‌సైట్ లో నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 87126 65785 నెంబర్ ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. శాంతియుత వాతావరణంలో పండుగ చేసుకోవావాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. తమకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మండపం నిర్వాహకులకు పోలీస్ శాఖ చేస్తున్న కొన్ని సూచనలు. గణేష్ మండపం వేసే వారు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలట.
రెండు బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలని చెబుతున్నారు. రాత్రి 10 గం నుంచి ఉదయం 6 గంటల వరకు స్పీకర్లు వినియోగించరాదట. అలాగే విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ తప్పనిసరిగా తీసుకోవాలట. అనుమతి లేకుండా విద్యుత్ తీసుకుని ప్రమాదాలకు దారితీయకుండా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే మండపాలతో రోడ్డును మూసివేయరాదు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించరాదు. కనీసం ద్విచక్ర వాహనం వెళ్లేందుకు అయిన దారి వదలాలట. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మైక్‌లు ఆఫ్ చేయాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసు శాఖ వారు తెలిపారు.