Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!
గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలు నిబంధనలను పాటించాలని, అధికారుల సూచనలకు సహకరించాలని కమిషనర్ కర్ణన్ విజ్ఞప్తి చేశారు.
- By Gopichand Published Date - 05:50 PM, Fri - 5 September 25

Hyderabad: గణేష్ నవరాత్రులు ముగింపు దశకు చేరుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో (Hyderabad) గణేష్ నిమజ్జనం కోసం బల్దియా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేలా మొత్తం యంత్రాంగం 48 గంటల పాటు హై-అలర్ట్‌లో ఉంటుందని తెలిపారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఆయన వివరాలను వెల్లడించారు.
విస్తృతమైన నిమజ్జన ఏర్పాట్లు
నిమజ్జన శోభాయాత్ర జరిగే 303 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో వాహనాలకు ఇబ్బందులు కలగకుండా రోడ్లకు మరమ్మత్తులు పూర్తి చేశారు. రోడ్డు సేఫ్టీ డ్రైవ్‌లో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం సాఫీగా, వేగంగా జరిగేలా 11 పెద్ద క్రేన్లతో సహా మొత్తం 40 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఈసారి ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోని పాయింట్ 4 వద్ద ఉన్న ‘బాహుబలి క్రేన్’ దగ్గర జరుగుతుందని కమిషనర్ కర్ణన్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.
Also Read: AP : గ్రామీణ వైద్య సేవల బలోపేతానికి నూతన దిశ..2309 హెల్త్ క్లినిక్‌లకు ప్రభుత్వం ఆమోదం
నిమజ్జనం తర్వాత రోడ్లు, నిమజ్జన ప్రాంతాలను శుభ్రం చేయడానికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 15 వేల మంది శానిటేషన్ సిబ్బంది మూడు షిఫ్టుల్లో 24 గంటలు పనిచేసి, స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఊరేగింపు జరిగే మార్గాలలో నిర్దేశించిన గార్బేజి పాయింట్లలోనే చెత్తను వేయాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భక్తులు చిన్న కాగితపు ముక్కలు (కలర్ పేపర్ ముక్కలు) శోభాయాత్రలో వాడొద్దని సూచించారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలు నిబంధనలను పాటించాలని, అధికారుల సూచనలకు సహకరించాలని కమిషనర్ కర్ణన్ విజ్ఞప్తి చేశారు. శోభాయాత్రలో పాల్గొనేటప్పుడు భద్రతా నియమాలను పాటించి, నిమజ్జన కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాల నిమజ్జనంపై దృష్టి సారించాలని, కృత్రిమ చెరువులను వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.