GHMC Council Meeting : రసాభాసగా ‘జీహెచ్‌ఎంసీ కౌన్సిల్’ సమావేశం.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏం చేశారంటే..
కార్పొరేటర్లపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పార్టీ ఫిరాయింపులు ఎవరు ప్రోత్సహించారో మీకు తెలియదా అని మేయర్ నిలదీశారు.
- By Pasha Published Date - 02:18 PM, Sat - 6 July 24

GHMC Council Meeting : పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల నినాదాలతో జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశంలో గందరగోళం నెలకొంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి పోడియంను చుట్టుముట్టారు. పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో కార్పొరేటర్లపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పార్టీ ఫిరాయింపులు ఎవరు ప్రోత్సహించారో మీకు తెలియదా అని కార్పొరేటర్లను మేయర్ నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. వెంటనే మేయర్ పదవికి రాజీనామా చేయాలని గద్వాల విజయలక్ష్మిని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్‌కు సిగ్గుండాలని కామెంట్ చేశారు. తమ తమ స్థానాల్లో కూర్చోవాలని మేయర్ చెప్పినా.. కార్పొరేటర్లు వినిపించుకోలేదు.
We’re now on WhatsApp. Click to Join
దీంతో జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశాన్ని(GHMC Council Meeting) 15 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. మళ్లీ కాసేపటికి సమావేశం ప్రారంభమైనా.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన గళం వినిపించడాన్ని కంటిన్యూ చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
Also Read :828 HIV Cases : ఎయిడ్స్‌తో 47 మంది స్టూడెంట్స్ మృతి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అప్పటివరకు బీఆర్‌ఎస్‌లో కీలక నేతలుగా కొనసాగిన మేయర్ గద్వాల విజయలక్ష్మి.. కాంగ్రెస్‌లో చేరిపోయారు. కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా వారితో పాటు హస్తం పార్టీకి జైకొట్టారు. ఈనేపథ్యంలో ఈసారి జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో బీఆర్ఎస్ బలంగానే ఉంది. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు గులాబీ పార్టీకి పెద్దసంఖ్యలోనే ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో 47 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంఐఎంకు చెందిన 41 మంది కార్పొరేటర్లు, బీజేపీకి చెందిన 39 మంది కార్పొరేటర్లు, కాంగ్రెస్‌కు చెందిన 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈనేపథ్యంలో త్వరలోనే జీహెచ్‌ఎంసీ మేయర్‌పై బీఆర్‌ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.