Weather Update: రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 30-06-2026 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, వానల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికగా ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. జులై 4వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక బుధవారం వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఇప్పటికే చెప్పుకోదగ్గ స్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం భరంపూర్‌లో 9 సెం.మీ భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా మల్యాలలో 8.6 సెం.మీ, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో 8.4 సెం.మీ వర్షపాతం రికార్డయింది. నల్గొండ జిల్లా దామరచర్లలో 8.3 సెం.మీ, చింతపల్లి మండలం గొడ్కొండ్లలో 8 సెం.మీ, ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలో 7.9 సెం.మీ చొప్పున వానలు పడ్డాయి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా సిరికొండలో 7.8 సెం.మీ, మోస్రాలో 7.8 సెం.మీ, జనగామ జిల్లా తాటికొండలో 7.7 సెం.మీ వాన పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిజాంబాద్‌లో 7.3 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీసలో 7.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. వీటితో పాటు ములుగు, కామారెడ్డి, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని పలు మండలాల్లో 6.4 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
సాధారణంగా జూన్ మొదటి వారంలోనే తెలంగాణను పలకరించాల్సిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ఆలస్యంగా జూన్ 8న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత కూడా రుతుపవనాల గమనం నెమ్మదించడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీనివల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జూన్ నెలలో కూడా ఎండలు దంచికొట్టాయి. అయితే ప్రస్తుతం రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా విస్తరించాయి. వాతావరణం అనుకూలించడంతో ఇకనైనా వానలు సకాలంలో పడి పంటల సాగు సవ్యంగా సాగుతాయని తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. రానున్న రోజుల్లో కురిసే వర్షాలు ఖరీఫ్ సాగు పనులకు ఎంతగానో దోహదపడతాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.