Harish Rao : పరిపాలన చేతకాక.. రాష్ట్రం పరువు తీస్తున్నావు : హరీశ్ రావు
Harish Rao : ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజల్లో ఆలోచనలు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ డైవర్షన్ పాలిటిక్స్ నడవవు. నిన్ను ప్రజలు వదిలిపెట్టరు.
- By Latha Suma Published Date - 05:28 PM, Mon - 28 October 24

CM Revanth Reddy : తెలంగాణ భవన్‌లో ఈరోజు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ..మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిప్పలు చెరిగారు. రేవంత్ రెడ్డి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదని హరీశ్‌రావు చురకలంటించారు. బడికి పోయే పిల్లల నుంచి మొదలుకుంటే పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు అందర్నీ రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగులు, నిరుద్యోగులను, ఇతర వర్గాలను అందర్నీ మోసం చేసి నేడు ప్రతిపక్షంపై దాడులకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై నిలదీస్తే.. బీఆర్ఎస్ పార్టీ మీద దాడులకు తెగబడుతున్నారు. రేవంత్ మెదడు నిండా విషం తప్ప విజన్ లేదు. విజన్ ఉన్నోళ్లు ఇలా చేయరు. రాష్ట్రాన్ని దివాళా తీయించావు. రాష్ట్ర ఆదాయం పడిపోయిందంటే.. నీకు పరిపాలన చేయడం చేతకాక, విజన్ లేక, అవగాహన పెంచుకోక ఈ రాష్ట్రం పరువు తీస్తున్నావు అని హరీశ్‌రావు చురకలాంటించారు.
బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజల్లో ఆలోచనలు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ డైవర్షన్ పాలిటిక్స్ నడవవు. నిన్ను ప్రజలు వదిలిపెట్టరు. రుణమాఫీ మీద నిలదీస్తే వికృతంగా నా గురించి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కేటీఆర్ మూసీ ప్రాజెక్టు విషయంలో నీ అవినీతిని బట్టయబలు చేయడంతో.. దృష్టి మరల్చడానికి కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నావ్. ఇది షేమ్. రాజకీయంగా కొట్లాడు. నేరుగా కొట్లాడు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి దాడులకు పాల్పడుతున్నాడు. మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొట్టడానికి వ్యతిరేకం అని కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకం అని చెప్పారు. పేదల హక్కుల కోసం కేటీఆర్ కొట్లాడిండు కాబట్టి ఆయన మీద బురద జల్లలాలని ఆయన క్యారెక్టర్‌ను దెబ్బతీలయాని కుట్ర చేస్తున్నావు. కానీ అట్టర్ ప్లాఫ్ అయ్యావు. ప్రజలు నీ డ్రామాను అర్థం చేసుకున్నారని హరీశ్‌రావు తెలిపారు.
పురుగుల లేని అన్నం కోసం గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, రైతుబంధు, రుణమాఫీ కోసం రైతులు, జీతాల కోసం అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీలకు నిధులు విడుదల చేయాలనీ జీపీ సిబ్బంది, ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ నీ సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజలు, మా సమస్యలు పరిష్కరించండని పోలీసులు, పెన్షన్ల కోసం వృద్ధులు.. ఇలా అందరూ రోడ్డెక్కుతున్నారు. అంటూ హరీశ్‌రావు రేవంత్ రెడ్డిపై విమర్శులు గుప్పించారు.