BRS : కాళేశ్వరం కమిషన్ నివేదికపై మరోసారి హైకోర్టుకు హరీశ్‌రావు
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయో లేదో తేల్చాల్సింది రాజకీయ పార్టీలు కాదు. న్యాయస్థానాలు, ప్రజలే నిజాన్ని బయటపెట్టాలి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజాన్ని దాచాలని చూస్తోందని ఆరోపించారు. పీపీఏ (పవర్ పాయింట్ ప్రెజెంటేషన్) ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడుతోంది.
- By Latha Suma Published Date - 12:59 PM, Sat - 30 August 25

BRS : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రముఖ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సమర్పించిన కాళేశ్వరం కమిషన్ నివేదికపై హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ నివేదికను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని కోరుతూ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ నివేదికను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని పిటిషన్‌లో ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ వద్ద పరిశీలనలో ఉంది. నివేదిక చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతూ, దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. ఇది తొలిసారి కాదు గతంలోనూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంటల చంద్రశేఖరరావు (కేసీఆర్)తో పాటు హరీశ్‌రావు కూడా కాళేశ్వరం నివేదికపై పిటిషన్లు దాఖలు చేశారు. అప్పట్లో ఆ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టి, సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.
Read Also: Modi China Tour : శాశ్వత మిత్రులు-శత్రువులంటూ ఏమీ ఉండదు..దేశ ప్రయోజనాలే శాశ్వతం: రాజ్‌నాథ్ సింగ్
ఇప్పుడు కొత్తగా దాఖలైన మధ్యంతర పిటిషన్‌తో ఈ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్‌లో ఈ కేసులపై తదుపరి విచారణ జరగనుంది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయో లేదో తేల్చాల్సింది రాజకీయ పార్టీలు కాదు. న్యాయస్థానాలు, ప్రజలే నిజాన్ని బయటపెట్టాలి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజాన్ని దాచాలని చూస్తోందని ఆరోపించారు. పీపీఏ (పవర్ పాయింట్ ప్రెజెంటేషన్) ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడుతోంది. అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా లేదు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టడమే కాకుండా, ప్రతిపక్ష పార్టీకి సమాధానాలు చెప్పే ధైర్యం అధికార పార్టీలో లేదు. ఇది పూర్తిగా రాజకీయ వ్యూహంగా మారింది అని విమర్శలు గుప్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందినప్పటికీ, ఇటీవల దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్ నివేదికలో ప్రాజెక్టు నిర్వహణలో అవకతవకలు, డిజైన్ లోపాలు, భారీ ఖర్చు పెరుగుదల వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. అయితే, ఈ నివేదిక రాజకీయ ప్రేరణతో తయారు చేయబడిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు తాజా పిటిషన్ రాజకీయంగా కూడా కీలకంగా మారింది. అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టే ముందు హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. న్యాయం జరగాలంటే రాజకీయ ప్రతీకారం తగదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల ప్రయోజనాల కోసమే చేపట్టినదని, దానిని అనవసరంగా విమర్శించడం తగదని ఆయన వ్యాఖ్యానించారు.