Group-1 Candidates: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. ఈనెల 27న నియామక పత్రాలు అందజేత!
ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారని, కాబట్టి వారికి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని సూచించారు.
- By Gopichand Published Date - 07:50 PM, Thu - 25 September 25

Group-1 Candidates: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా ఇటీవల ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థులకు (Group-1 Candidates) తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈనెల 27న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు (అపాయింట్‌మెంట్ ఆర్డర్లు) అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు వెల్లడించారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాట్లపై సీఎస్ సంబంధిత ఉన్నత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రూప్-1 ద్వారా ఎంపికైన మొత్తం 563 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ అభ్యర్థులు దాదాపు 18 ప్రభుత్వ శాఖలకు చెందినవారు. ముఖ్యంగా రెవిన్యూ, హోం, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. నియామక పత్రాలు అందుకోనున్న ప్రతి అభ్యర్థితో పాటు వారి ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమానికి అనుమతించనున్నారు. రెవిన్యూ, హోం, జీఏడీ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం రేపటిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Dussehra Holidays: అంగన్‌వాడీ కేంద్రాలకు తొలిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!
సీఎస్ సందేశం
ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారని, కాబట్టి వారికి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ సేవ పట్ల వారికి ఉన్నత భావన కలిగేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, డీజీపీ, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, కమిషనర్లతో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ నియామకాల పట్ల చిత్తశుద్ధిని, పారదర్శకతను చాటిచెబుతుంది.