Etela Rajender : మూసీ నిర్వాసితులతో కలిసి ఈటల రాజేందర్ ర్యాలీ
Etela Rajender : డబుల్‌బెడ్రూమ్ ఇళ్లకి ఎలా వెళ్లగలం? వీళ్లు పెట్టే టెన్షన్‌కి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. రూ.కోట్లు ఇచ్చినా.. మా ప్రాణాలు పోయినా మేం ఇక్కడి నుంచి కదలం'' అని పలువురు నిర్వాసితులు ఈటల వద్ద సమస్యలు చెప్పుకున్నారు.
- Author : Latha Suma
Date : 23-10-2024 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
Musi Residents : నగరంలోని చైతన్యపురి డివిజన్ పరిధిలోని మూసీ నిర్వాసితులతో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ” ఈటల చేసిన పోరాటం వల్లే మా ఇళ్లు ఇప్పటికీ ఉన్నాయి. అయినా, మాకు ఆందోళనగానే ఉంది. మీరే మమ్మల్ని కాపాడాలి. మూసీ సుందరీకరణ కంటే మా ఇళ్లే ముఖ్యం. సుందరీకరణ కంటే ముందు డ్రైనేజీ క్లీన్ చేయండి. సియోల్ వెళ్లిన బృందం చూపిస్తుంది కదా.. తెల్లటి నీళ్లు. ఇక్కడ కూడా అలా చేస్తే మేమే వెళ్లిపోతాం. మేం కట్టుకున్న మంచి ఇళ్లు వదిలి.. డబుల్‌బెడ్రూమ్ ఇళ్లకి ఎలా వెళ్లగలం? వీళ్లు పెట్టే టెన్షన్‌కి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. రూ.కోట్లు ఇచ్చినా.. మా ప్రాణాలు పోయినా మేం ఇక్కడి నుంచి కదలం” అని పలువురు నిర్వాసితులు ఈటల వద్ద సమస్యలు చెప్పుకున్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డిపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ”రూ.5 వేలు ఇస్తే మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. పేదలంటే మీకు అంత చులకనా..?మాటకి చేతలకు పొంతన లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్లలో కేసీఆర్ హుస్సేన్ సాగర్ శుభ్రం చేయించలేదు. జీడిమెట్ల, బాలా నగర్ పారిశ్రామిక రసాయనాలు మూసీలో కలవకుండా చూడండి. ఉన్న ఊరిలో ఉపాధి లేక ఇక్కడి వచ్చి బతుకుతుంటే వారి ఇళ్లు కూలుస్తారా? ఏళ్లుగా కష్టపడి కట్టుకున్న మూడంతస్థుల ఫ్లోర్ల భవనాలను కూల్చి రూ.25 వేలు ఇస్తారా?” అని ప్రశ్నించారు.
మరోవైపు.. మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకంటున్న విషయం తెలిసిందే. మూసీ పునరుజ్జీవనం పేరుతో గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా మూసీ పరివాహకప్రాంతాల్లోని అక్రమణలను తొలగిస్తోంది. రివర్ బెడ్ ప్రాంతంలోని ఇండ్లను కూల్చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మూసీ నిర్వాహిసుతులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తోంది. ఇప్పటికే పలువురు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేశారు. రూ.25వేల చొప్పున నగదు, ఉపాధి కోసం రూ.2 లక్షల లోన్లను ప్రభుత్వం అందజేస్తోంది.