Telangana: జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి
ఈ జనవరి నెల కరెంటు బిల్లులు చెల్లించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు.
- By Praveen Aluthuru Published Date - 05:13 PM, Sat - 20 January 24

Telangana: ఈ జనవరి నెల కరెంటు బిల్లులు చెల్లించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలని హామీలను ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని పేర్కొన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు లేదని చెప్పిన కేటీఆర్ సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి పదవి చేపట్టిన కిషన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు.
హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాను ఎగురవేసి బలమైన సందేశం ఇచ్చినందుకు పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకున్నది బీఆర్‌ఎస్ పార్టీయేనన్నారు. కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్లు మొదలుకొని రైతులకు రైతుబంధు అందడం లేదని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు హామీలు కాదని వాటిని 420 హామీలుగా పేర్కొన్నారు. రకరకాల ప్రకటనల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్