Deputy Cm Bhatti: ‘నాగోబా జాతర’ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం.
- By Gopichand Published Date - 12:21 PM, Tue - 28 January 25

Deputy Cm Bhatti: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Deputy Cm Bhatti) ఆదివాసీల ప్రజలందరికీ ‘నాగోబా జాతర’ శుభాకాంక్షలు తెలిపారు. కొండకోనల్లో నివసించే ఆదివాసీలు ఐదు రోజుల పాటు దగ్గర చేరి మనోభావాలను పంచుకునే జాతర మన నాగోబా. మేస్రం వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ జాతరకు లక్షల్లో హాజరయ్యే మైదాన ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది అని డిప్యూటీ సీఎం చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాగోబా దేవాలయంకు నిధులు కేటాయించి అభివృద్ధి చేసిన విషయాన్ని భట్టి విక్రమార్క మల్లు గుర్తు చేసుకున్నారు.
నాగోబా జాతర అంటే?
నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు.ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవుడు. నాగోబా దేవాలయం ఆదిలాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కెస్లాపూర్ గ్రామంలో ఉంది.కెస్లాపూర్‌లో జరిగే ఈజాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్ జనాభా 400 కు మించదు. కాని పండగనాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. యేటా పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభ మవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమ వుతాయని గిరిజనుల నమ్మకం.
Also Read: Virat Kohli Fans: విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే?
దేవాలయ నిర్మాణం
మెస్రం వంశీయులు తొలినాళ్ళలో నాగోబా దేవత వెలిసిన పుణ్యస్థలం (పుట్ట)ను మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డి పరకలతో చిన్న గుడిసెను, 1995లో సిమెంట్, ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో గుడిని నిర్మించారు. 2022లో శిలలతో నూతన దేవాలయాన్ని నిర్మించారు.
22 పొయ్యిలు మాత్రమే వంట
జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు.