Deputy Cm Bhatti: ఎకో టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉన్నందున దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు.
- By Gopichand Published Date - 04:50 PM, Tue - 4 March 25

Deputy Cm Bhatti: సమ్మక్క, సారలమ్మ జాతర గోదావరి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Deputy Cm Bhatti), మంత్రి కొండ సురేఖ అధికారులకు సూచించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశంలో భాగంగా దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల సమావేశం నిర్వహించారు. వందల కోట్ల రూపాయల తో చేపడుతున్న పనులు భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలంటే ఇప్పటినుంచే అధికారులు అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని తెలిపారు.
రాష్ట్రంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉన్నందున దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ పార్క్‌లను అభివృద్ధి చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో సేద తీరేందుకు ఉపకరిస్తాయని తెలిపారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాలు, అర్బన్ పార్కులు అభివృద్ధి చేసుకోవడం ద్వారా శాఖలకు ఆలయం సమకూరుతుందని తెలిపారు.
Also Read: Heat Wave Warning: అలర్ట్.. 125 ఏళ్ల రికార్డు బద్దలు!
పురాతన దేవాలయాలను పునరుద్ధరించే పనులను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేపట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు. దేవాలయాల ద్వారా ప్రజల్లో భక్తి భావన పెరుగుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చేయూతగా ఉంటుందని తెలిపారు. ప్రజల్లో భక్తి భావన పెంపొందితే క్రమశిక్షణకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆరు ప్రధాన దేవాలయాల అభివృద్ధికి పాస్టర్ ప్లాన్ ల రూపకల్పనపై మంత్రులు చర్చించారు.
అటవీ హక్కు చట్టం ద్వారా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చాం వారు సాగు చేసుకుంటున్నా నేపథ్యంలో అటవీ శాఖ తో సమన్వయం లేకపోవడం మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నట్టు గుర్తించాం. గిరిజన రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు, వివిధ పంటల సాగుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోవడం, సోలార్ విద్యుత్ ద్వారా గిరిజన రైతులు పంపుసెట్ల వినియోగం వంటి కార్యక్రమాల పై చర్చించేందుకు కొద్దిరోజుల్లోనే అటవీ, గిరిజన, ఉద్యాన, వ్యవసాయ, ఇంధన శాఖల అధికారులతో ఒక సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. CAMPA (compensatory afforestation fund management and planning authority) పనులు పెద్ద సంఖ్యలో చేపట్టి పచ్చదనాన్ని కాపాడాలని సూచించారు.
ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకొని చెక్ డ్యాములు, ఇతర పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు. హైదరాబాద్ మహానగరం తో పాటు పరిసరాల్లో 59 అర్బన్ పార్కులు ఉన్నాయి. ఒత్తిడిలో జీవించే నగర ప్రజలు ఉపశమనం పొందేందుకు వీటిని అభివృద్ధి చేయాలని.. అర్బన్ పార్క్ ల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి. విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. చిన్న చిన్న మొక్కలు కాకుండా రెండున్నర అడుగుల ఎత్తుకు తగ్గకుండా ఉన్న మొక్కలను నాటడం ద్వారా ఎక్కువ సంఖ్యలో బతికే అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీం, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రమా అయ్యర్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్, తదితరులు పాల్గొన్నారు.