Praja Vijayotsava Sabha : తాగుబోతుల సంఘానికి కేసీఆర్ అధ్యక్షుడు – సీఎం రేవంత్
Praja Vijayotsava Sabha : కేసిఆర్ ఫామ్ హౌస్ లోనే కూర్చోవాలని, కుదిరితే ప్రతిరోజు వైన్ షాప్ ద్వారా మద్యం సీసాలు అందేలా తాను చెబుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు
- By Sudheer Published Date - 07:40 PM, Tue - 19 November 24

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) పై నిప్పులు చెరిగారు. తాగుబోతుల సంఘానికి కేసీఆర్ అధ్యక్షుడు అని , అసెంబ్లీ వచ్చే దమ్ము కేసీఆర్ కు లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నేటికీ ఏడాది పూర్తి అవుతున్న సందర్బంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రం సహా పలు అభివృద్ధి పనులను, వరంగల్ – కరీంనగర్ రహదారిపై నయీంనగర్ వద్ద ఉన్న ప్రధాన రహదారిపై పూర్తయిన వంతెన నిర్మాణాన్ని వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు.
అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రానికి తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే అది మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేసిఆర్ ఫామ్ హౌస్ లోనే కూర్చోవాలని, కుదిరితే ప్రతిరోజు వైన్ షాప్ ద్వారా మద్యం సీసాలు అందేలా తాను చెబుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. మహిళల సంక్షేమానికి తాము పాటుపడుతుంటే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రతి పథకాన్ని అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, ఇప్పటికే ఫ్రీ బస్, గృహ జ్యోతి, 500 రూపాయలకే సిలిండర్ లను పంపిణీ చేస్తుందన్నారు.
బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులను తాము ఇప్పటికీ తీరుస్తున్నామని, పదేళ్ల కాలంలో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిచేసే మనసు కూడా కేసీఆర్ కు లేదన్నారు. వరంగల్ నగరం కేసిఆర్ చేతిలో మోసపోయిందని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ నగరానికి తలమానికంగా వరంగల్ ను తీర్చిదిద్దుతుంన్నారు. తెలంగాణలోని ప్రముఖ క్రీడాకారులు ఒక్కో ఆటలో బ్రాండ్ అంబాసిడర్లు అయితే కేసీఆర్ మద్యానికి అంబాసిడర్ అన్నారు. కాళోజీ ఉంటే కేసీఆర్ను రాష్ట్రం నుంచి తరిమేసేవారని రేవంత్ మండిపడ్డారు. కెసిఆర్ అనే మొక్కను తెలంగాణలో మళ్లీ మొలవనివ్వనని ఛాలెంజ్ చేశారు. ఎవరో ఇస్తే CM కుర్చీ రాలేదని, తొక్కుకుంటూ వచ్చానన్నారు.
రూ.2లక్షలలోపు రుణమాఫీ రైతులందరికీ పూర్తి చేస్తామని వెల్లడించారు. ‘సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదు. సమస్యలు పరిష్కరించి అందరికీ రుణమాఫీ పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే రుణమాఫీకి రూ.18వేల కోట్లు కేటాయించాం. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రూ.2లక్షలలోపు రుణమాఫీ నిధులు విడుదల చేశాం’ అని పేర్కొన్నారు. కెసిఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అనిఈ సందర్బంగా సీఎం సవాల్ విసిరారు. ఆయన అసెంబ్లీకి ఎప్పుడు వస్తారో చెప్పాలని, అప్పుడే రుణమాఫీపై చర్చ పెడతామన్నారు. ‘అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం. అలాంటి ప్రయత్నాలు చేస్తే జైలుకు పంపిస్తాం. 10నెలల్లో ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని కేసీఆర్ అంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్లోనే ఉండాలి’ అని రేవంత్ అన్నారు.
అలాగే చాలా రాష్ట్రాల్లో 3-4 ఎయిర్పోర్టులు ఉంటే మనకు హైదరాబాద్లో మాత్రమే విమానాశ్రయం ఉందని , మనకి ఎందుకు ఎక్కువ ఎయిర్పోర్టులు ఉండొద్దు..అని ప్రశ్నించారు. వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండంలో మనం కూడా ఎయిర్పోర్టులు కట్టుకుని ప్రపంచంతో పోటీపడదాం. పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది’ అని పేర్కొన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చేందుకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకుని దీవించారు. మమ్మల్ని దీవించి పదవులు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. గత ప్రభుత్వంలో కొన్నేళ్లపాటు మహిళా మంత్రి కూడా ఉండలేదు. ఇందిరమ్మరాజ్యంలో మాత్రం ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు కార్యాచరణ చేపట్టాం అని చెప్పుకొచ్చారు.