CM Revanth Sabha: డిసెంబర్ 4న పెద్దపల్లిలో సీఎం రేవంత్ సభ!
ఈ సభలో ఇటీవల గ్రూప్-4లో ఎంపికైన 8143 మందికి, 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేస్తారని వివరించారు.
- Author : Gopichand
Date : 29-11-2024 - 10:21 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth Sabha: డిసెంబర్ 4వ తేదీన పెద్ద పల్లిలో నిర్వహించే యువ శక్తి సభకు (CM Revanth Sabha) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దాదాపు 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందచేస్తారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లిలో డిసెంబర్ 4వ తేదీన తలపెట్టిన ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శ్రీధర్, సందీప్ సుల్తానియా, క్రిస్టినా చోంగ్తు, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, సి.ఎంఓ అధికారి వేముల శ్రీనివాసులు, సమాచార శాఖ ప్రత్యేక కమీషనర్ హరీష్, విద్యా శాఖ డైరెక్టర్ వెంకట నర్సింహా రెడ్డి, పెద్దపల్లి కలెక్టర్ హర్ష, రామగుండం పోలీస్ కమీషనర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Also Read: Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంతకే ఎందుకిలా?
ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువతకై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ సభలో ఇటీవల గ్రూప్-4లో ఎంపికైన 8143 మందికి, 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేస్తారని వివరించారు. ఈ సభలోనే స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పంద పత్రాలను సంతకం చేయడం జరుగుతుందని,డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభోత్సవం, సి.ఎం కప్ ప్రారంభం లతో పాటు వందలాది కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు.
వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలియచేసే దాదాపు 40 స్టాళ్లను ఈ సభా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్‌లో మాదిరిగానే పెద్దపల్లి సభకు విస్తృత ఏర్పాట్లను చేయాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.