Warangal : వరంగల్ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
వరంగల్ వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ – దిశ మార్చేందుకు ఈరోజు నేను వస్తున్నానని ట్వీట్ లో సీఎం రేవంత్ రెడ్డిపేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 03:49 PM, Tue - 19 November 24

CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రజాపాలన-విజయోత్సవాలు”పేరుతో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. అయితే వరంగల్ బయలుదేరడానికి ముందు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తెలంగాణ ఛైతన్యపు రాజధాని అని ఓరుగళ్లును కొనియాడారు. కాళోజీ నుండి నరసింహారావు వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేలని చెప్పారు. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సారుకు జన్మనిచ్చిన గడ్డ అని తెలిపారు. హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క, సారలమ్మలు నడయాడిన ప్రాంతమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రమని తెలిపారు. వరంగల్ వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ – దిశ మార్చేందుకు ఈరోజు నేను వస్తున్నానని ట్వీట్ లో సీఎం రేవంత్ రెడ్డిపేర్కొన్నారు.
కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తైంది. ప్రజాపాలనతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభను వరంగల్ లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో వరంగల్ పై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో ఓ ట్వీట్ చేశారు.
ఇకపోతే.. సీఎం ఈ పర్యటనలో భాగంగా వరంగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ హన్మకొండల అభివృద్ధికి నిధులు కేటాయించారు. 2040 టార్గెట్ గా వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్మించనున్న 22 మహిళా శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో పది జిల్లాలో ఇప్పటికే ఈ భవనాలు ఉండగా, మిగిలిన జిల్లాల్లో కొత్తగా నిర్మించనున్నారు. ఎంజీఎంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌నూ ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేస్తారు. అనంతరం విజయోత్సవ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
Read Also: Mens Day 2024 : కవితను చదివి వినిపించిన మహేశ్ బాబు.. ‘మెన్స్ డే’ ప్రత్యేక పోస్ట్