Indiramma Houses Survey App : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికే ప్రయారిటీ : సీఎం రేవంత్
ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులలోని సమాచారం ఆధారంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ(Indiramma Houses Survey App) వెళ్లి వివరాలను సేకరిస్తారు.
- By Pasha Published Date - 12:16 PM, Thu - 5 December 24

Indiramma Houses Survey App : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వేను నిర్వహించే ప్రత్యేక మొబైల్ యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీంలో లబ్ధిదారుల ఎంపికలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్‌ను రూపొందించిందన్నారు. దీన్ని ఇప్పటికే మహబూబ్‌నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించామని సీఎం తెలిపారు.
Also Read : Prime Minister Ousted : ‘అవిశ్వాసం’తో ప్రధాని ఔట్.. ఏకమై ఓడించిన అధికార, విపక్షాలు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం అవుతుందని సీఎం రేవంత్ వెల్లడించారు. ‘‘ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులలోని సమాచారం ఆధారంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ(Indiramma Houses Survey App) వెళ్లి వివరాలను సేకరిస్తారు. వాటిని అక్కడికక్కడే ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్‌లో నమోదు చేస్తారు’’ అని ఆయన వివరించారు. ‘‘సర్వేలో భాగంగా.. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుడి పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆర్థిక పరిస్థితి, ఇళ్లు నిర్మించనున్న స్థలం, ఇతర వివరాలకు సంబంధించిన దాదాపు 35 ప్రశ్నలను అడిగి వివరాలను యాప్‌లో ఎంటర్ చేస్తారు. వాటి ఆధారంగా విడతల వారీగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తారు. ఇందిరమ్మ కమిటీలు గ్రామసభలను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపడతాయి’’ అని సీఎం చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కర్మచారులకు ప్రయారిటీ ఇస్తామని స్పష్టం చేశారు. ‘‘దేశంలో గుడి లేని ఊరు ఉందేమో.. కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదు’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘రోటీ, కపడా, మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం. ప్రజలు ఇల్లు, వ్యవసాయ భూమిని ఆత్మగౌరవంగా భావిస్తారు. అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూపంపిణీ పథకాలను ప్రారంభించారు’’ అని ఆయన చెప్పారు. గతంలో కేసీఆర్ రద్దు చేసిన గృహనిర్మాణశాఖను పునరుద్ధరించామని రేవంత్ తెలిపారు. ప్రతీ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌజ్‌ను నిర్మిస్తామన్నారు.
Also Read :Andhra Odisha Border : ‘ఆంధ్రా-ఒడిశా బార్డర్’లో గుప్పుమంటున్న గంజాయి.. సంచలన నివేదిక
తొలి ఏడాదిలో తెలంగాణలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయిస్తారు. 400 చదరపు అడుగుల్లో ఇంటిని కట్టుకోవచ్చు. మహిళ పేరుతో ఇల్లు మంజూరు అవుతుంది. 4 విడతల్లో లబ్ధిదారులకు రూ.5 లక్షల నగదును అందజేస్తారు. తొలి విడతలో రూ1.20 లక్షలు, స్లాబ్ పడిన తర్వాత రూ.1.75 లక్షలు వస్తాయి. తదుపరిగా మిగతా డబ్బులు మంజూరు చేస్తారు.