Raghunandan Rao: ఇందిరమ్మ కమిటీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం : రఘునందన్ రావు
ఇందిరమ్మ కమిటీల్లో బీజేపీ నేతలకు భాగస్వామ్యం ఇవ్వడం లేదని రఘునందన్ రావు(Raghunandan Rao) తెలిపారు.
- By Pasha Published Date - 02:16 PM, Wed - 30 October 24

Raghunandan Rao: కేసీఆర్, కేటీఆర్, సీఎం రేవంత్‌లపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. పేదలకు ఇళ్లను నిర్మించే స్కీంకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే.. దానికి ఇందిరమ్మ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. గ్రామ సభలు పెట్టకుండా కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ కమిటీల్లో బీజేపీ నేతలకు భాగస్వామ్యం ఇవ్వడం లేదని రఘునందన్ రావు(Raghunandan Rao) తెలిపారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఇందిరమ్మ కమిటీలు చెల్లవని, వాటిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు. గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలే కానీ.. అందుకోసం ఇందిరమ్మ కమిటీల అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Also Read :Maoist Party : ప్రజలకు ఆ డబ్బు తిరిగివ్వకుంటే శిక్ష తప్పదు.. మావోయిస్టుల సంచలన లేఖ
‘‘మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. పేదలు నివసించే 15 కిలోమీటర్లు వదిలిపెట్టి, మిగితా మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే సరిపోతుంది. మూసీ సుందరీకరణ పేరుతో డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు’’ అని రఘునందన్ రావు ఆరోపించారు. ఆంధ్రా కంపెనీలకే రేవంత్ రెడ్డి కాంట్రాక్టులను కట్టబెడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదని.. తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌కు ‘సీ’ స్థానం కేటాయించారని ఆయన చురకలు అంటించారు. భవిష్యత్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌజ్‌కు పరిమితమవగా, మాజీ మంత్రి కేటీఆర్ రేవ్ పార్టీలలో తిరుగుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ నేతలు బాంబులు పేలుస్తామని అంటున్నారు. అయితే అవి కుక్క తోక పటాకులా? సూతిల్ బాంబులు పేలుతాయా అన్నది చూడాలి. బాంబులు పేల్చుతామని చెప్పడం కాకుండా దాన్ని చేసి చూపించాలి’’ అని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిపరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
Also Read :Super Powers : సూపర్ పవర్స్ వచ్చాయని.. గోడ దూకిన ఏఐ ఇంజినీరింగ్ స్టూడెంట్
‘‘ఆరు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రూ.1200 కోట్లు విడుదల చేసింది. గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంది. దీంతో పంచాయతీ కార్యదర్శులు వ్యక్తిగతంగా అప్పులు చేసి ఆ బిల్లులు కడుతున్నారు. ఈ కారణాల వల్లే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టే ధైర్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదు’’ అని రఘునందన్ రావు విమర్శించారు.