Maoist Party : ప్రజలకు ఆ డబ్బు తిరిగివ్వకుంటే శిక్ష తప్పదు.. మావోయిస్టుల సంచలన లేఖ
ఈ లేఖ మావోయిస్టు పార్టీ(Maoist Party) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైంది.
- By Pasha Published Date - 01:22 PM, Wed - 30 October 24

Maoist Party : మావోయిస్టుల లేఖ తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ఈ లేఖ మావోయిస్టు పార్టీ(Maoist Party) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైంది. బీఆర్ఎస్ హయాంలో దళితబంధు పేరిట అమాయక ప్రజల వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేసిన మాజీ ప్రజాప్రతినిధులు తిరిగి డబ్బులు ఇచ్చేయాలని ఈ లేఖలో మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ప్రజల డబ్బులను ప్రజలకు తిరిగి ఇచ్చేయకుంటే.. ప్రజల చేతుల్లో వారికి శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు.
Also Read :Super Powers : సూపర్ పవర్స్ వచ్చాయని.. గోడ దూకిన ఏఐ ఇంజినీరింగ్ స్టూడెంట్
మహాముత్తారంలో రాజిరెడ్డి, రాము, కిష్టయ్య, సడువలి, ఆర్.సడువలి, దుర్గయ్య, కాటారంలో జనార్దన్, రాకేష్, రాజు, మహదేవపూర్‌లో శ్రీనివాసరావు, బాపు, పలిమెలలో తిరుపతి, మల్హర్ రావు, రాఘవ, శ్రీనివాసరావు, భూపాలపల్లిలో హరిబాబు ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇవ్వకపోతే శిక్ష తప్పదని లేఖలో మావోయిస్టులు ప్రస్తావించారు.ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మండల, జిల్లాస్థాయి నేతల పేర్లు ఉండడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ లేఖ నిజమైనదా ? నకిలీదా ? అనేది గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి, ఆశలు చూపించి డబ్బులు వసూలు చేయడాన్ని మావోయిస్టు పార్టీ తప్పుపట్టింది.
Also Read :Balmoori Venkat : కేటీఆర్, కౌశిక్‌పై ఫైర్.. డ్రగ్స్ టెస్టుకు శాంపిల్స్ ఇచ్చిన అనిల్, బల్మూరి
దళిత బంధు పథకం రెండోదశ కింద మంజూరైన నిధులను విడుదల చేయాలంటూ రాష్ట్రంలో పలుచోట్ల ఇటీవలే లబ్ధిదారులు నిరసనలు తెలిపారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలువురు దళితులకు ఈ పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కో లబ్ధిదారుడికి దళిత బంధు సాయాన్ని రూ.12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చాక.. దళిత బంధు పథకానికి ‘అంబేద్కర్ అభయ హస్తం’ అని పేరు పెట్టింది. ఈ పథకంలో రెండో దశ కింద ఎంపికైన లబ్ధిదారులు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆమోదించిన నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు. ఆయా యూనిట్లను గ్రౌండింగ్ చేసే స్థితిని బట్టి జిల్లాల కలెక్టర్లు నిధులను విడుదల చేస్తున్నారు.