Harish Rao: సీఎం రేవంత్ వారికి సాయం చేయలేదు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని హరీష్ రావు అన్నారు. పండుగ పూట చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా నిధులు లేవని విమర్శించారు.
- By Gopichand Published Date - 03:30 PM, Sun - 21 September 25

Harish Rao: సికింద్రాబాద్, రాంగోపాల్ పేటలోని కస్తూర్బానగర్‌లో తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao).. తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. “వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా నాలాలు శుభ్రం చేయించకపోవడం వల్లే వరదలు వచ్చాయని, గతంలో కేసీఆర్ నాయకత్వంలో నగరంలో నాలాలు శుభ్రం చేయించేవారని గుర్తు చేశారు.
వరదల కారణంగా ఇళ్లలోని నిత్యావసర వస్తువులు కొట్టుకుపోయాయని, ప్రజలు తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని విమర్శించారు. హైదరాబాద్‌లో వరదల్లో కొట్టుకుపోయి 7, 8 మంది చనిపోవడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని హరీష్ రావు ఆరోపించారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషి
ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయడంలో విఫలమైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన వంతుగా 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి ఆదుకుంటున్నారని హరీష్ రావు ప్రశంసించారు. “రోడ్లు గుంతలమయమయ్యాయి. గుంతలు పూడ్చే తెలివి లేదు కానీ, ‘ఫోర్త్ సిటీ’ గురించి మాట్లాడుతున్నారు” అని రేవంత్ రెడ్డిని హరీష్ రావు ఎద్దేవా చేశారు. పోర్ట్ సిటీ కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం ఆరాటపడుతోందని ఆరోపించారు.
Also Read: PM Modi: ఈరోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ..!
పార్టీ ఫిరాయింపులపై వ్యాఖ్యలు
పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి పూర్తిగా బజారులో నిలబడి ఉన్నారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదంట. ఇంతకంటే బరితెగింపు మాటలు ఉంటాయా?” అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తామే మారినట్లు ట్విట్టర్‌లో పెట్టుకున్నారని, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ 10 మందిని పార్టీలో చేర్చుకున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీకి కనిపించి, కాంగ్రెస్‌లో చేరి కండువా కప్పుకున్నా పార్టీ మారినట్టు కాదని సిగ్గు లేకుండా చెబుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
బతుకమ్మ పండుగ గురించి
రాష్ట్ర ప్రజలందరికీ, అక్కాచెల్లెమ్మలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా వీధి దీపాలైనా వెలిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకునేందుకు చెరువులు బాగు చేసి, బతుకమ్మ మెట్లు, ఘాట్లు కట్టించారని గుర్తు చేశారు. ఈరోజు బతుకమ్మకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు, నిధులు
స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని హరీష్ రావు అన్నారు. పండుగ పూట చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా నిధులు లేవని విమర్శించారు. “మాటలకు ఎక్కువ, చేతులకు తక్కువ ఇది రేవంత్ పాలన” అని విమర్శించారు. ఈ పండుగ పూటైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి బతుకమ్మ పండుగను జరుపుకునేలా చూడాలని డిమాండ్ చేశారు.