CM Revanth: మహబూబ్‌నగర్ జిల్లా యువతకు సీఎం రేవంత్ బంపరాఫర్.. త్వరలోనే 2 వేల ఉద్యోగాలు!
గత పాలకులు నిధులను తరలించుకున్నా తాము ఏడ్వలేదని, ఇప్పుడు తమకు అవకాశం వచ్చిందని చెప్పారు. దానిని కొందరు దుష్టులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
- By Gopichand Published Date - 02:54 PM, Sun - 10 November 24

CM Revanth: మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ (CM Revanth) రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రూ.110 కోట్లతో ఎలివేటేడ్ కారిడార్‌తో కూడిన ఘాట్ రోడ్డు నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. అనంతరం పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ కురుమూర్తి స్వామి దయ వల్లనే తాను సీఎం అయ్యాయనని అన్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఉన్నారు. వారికి పూజార్లు ఆశీర్వాదాలు అందజేశారు.
అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్.. కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. స్థానికంగా సౌకర్యాలు లేవని తెలియడంతోనే ఘాట్ రోడ్డుకు రూ.110 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ జిల్లా ప్రాజెక్టులను గత పాలకులే అడ్డుకున్నారని దుయ్యబట్టారు. వారిని పార్లమెంట్‌కు పంపి, రెండు సార్లు సీఎం చేసిన జిల్లాను పట్టించుకోలేదని మండిపడ్డారు. తనను సీఎం చేసిన పాలమూరును అభివృద్ధి చేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
గత పాలకులు నిధులను తరలించుకున్నా తాము ఏడ్వలేదని, ఇప్పుడు తమకు అవకాశం వచ్చిందని చెప్పారు. దానిని కొందరు దుష్టులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటివారిని పాలమూరు యువత ఉపేక్షించరన్నారు. జిల్లాకు వచ్చే ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు పాలమూరు యువతకే ఇవ్వాలని కంపెనీలకు సూచించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి పాడిపంటలతో విలసిల్లేట్లు చేసేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలుంటాయన్నారు.
నారాయణపేట్- కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తామని తెలిపారు. మా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు ఆరోపణలు చేసి చిల్లర రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదని తెలిపారు. నాపై కోపం ఉంటే రాజకీయంగా నాపై కక్ష సాధించండి తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దు.. జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే పాలమూరు జిల్లా ప్రజలు క్షమించరని.. చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని ఫైర్ అయ్యారు. ఎక్కడ ఉన్నా.. ఈ జిల్లా అభివృద్దిని కాంక్షించేవాడినే అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో 2 వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు.