రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు!
ఇటీవలే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి, నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
- Author : Gopichand
Date : 23-12-2025 - 5:23 IST
Published By : Hashtagu Telugu Desk
Check Power: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పాలనలో అత్యంత కీలకమైన మార్పు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో ఆర్థిక లావాదేవీల నిర్వహణకు సంబంధించి ఉప సర్పంచ్‌లకు ఇప్పటివరకు ఉన్న చెక్ పవర్ (చెక్‌పై సంతకం చేసే అధికారం)ను రద్దు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, స్థానిక సంస్థల ప్రతినిధుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
నిర్ణయం వెనుక నేపథ్యం
ఇటీవలే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి, నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. గతంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఇద్దరూ సంయుక్తంగా చెక్కులపై సంతకం చేస్తేనే పంచాయతీ నిధులు డ్రా చేసే వీలుండేది. అయితే గత పాలకవర్గాల సమయంలో అనేక గ్రామాల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల మధ్య రాజకీయ విభేదాల కారణంగా నిధుల విడుదల ఆగిపోయి, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ ప్రతిష్టంభనను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పు చేపట్టింది.
Also Read: సూర్యకుమార్ యాదవ్ తర్వాత భారత్ తదుపరి కెప్టెన్ ఎవరు?
కొత్త విధానం ఏమిటి?
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై గ్రామ పంచాయతీ నిధుల వినియోగానికి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకాలు ఉంటే సరిపోతుంది. ఉప సర్పంచ్ ఆమోదం లేదా సంతకంతో పని లేకుండానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించేలా నిబంధనలను సవరించారు. దీనివల్ల పాలనలో వేగం పెరుగుతుందని, సర్పంచ్‌కు పూర్తిస్థాయి స్వేచ్ఛ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగిసి, ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్య పాలన ప్రారంభమవుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. ఈ నిబంధన వల్ల గ్రామాభివృద్ధి వేగవంతం అవుతుందా లేక సర్పంచ్-ఉప సర్పంచ్‌ల మధ్య దూరం మరింత పెరుగుతుందా అనేది భవిష్యత్తులో తేలనుంది.