MLC Kavitha : ‘‘అదానీకొక న్యాయం.. ఆడబిడ్డకొక న్యాయమా ?’’.. ప్రధాని మోడీకి కవిత ప్రశ్న
ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలయ్యాక కవిత(MLC Kavitha) రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.
- By Pasha Published Date - 04:48 PM, Thu - 21 November 24

MLC Kavitha : అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీపై అమెరికాలో కేసు నమోదై, అరెస్టు వారెంట్ జారీ అయిన అంశంపై బీఆర్ఎస్ అగ్ర నాయకురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. అఖండ భారతంలో అదానీకొక న్యాయం… ఆడబిడ్డకొక న్యాయమా ? అని కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా.. ఆడబిడ్డను కాబట్టి తనను మోడీ అరెస్టు చేయించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు లేకున్నా అమాయక ఆడబిడ్డను అరెస్ట్ చేయించడం ఈజీ అని.. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయించడం మాత్రం చాలా కష్టమని ఆమె కీలక కామెంట్ చేశారు. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని మోడీ అదానీ వైపే ఉంటారా అని కవిత ప్రశ్నను సంధించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా కవిత సంచలన ట్వీట్ చేశారు. బీజేపీ, ప్రధాని మోడీ తీరుపై ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలయ్యాక కవిత(MLC Kavitha) రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.
అఖండ భారతంలో
అదానికో న్యాయం…
ఆడబిడ్డకో న్యాయమా ?ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ?
ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ??
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 21, 2024
Also Read : World Television Day 2024: తిరుగులేని ‘ఠీవీ’.. విజువల్ మీడియాలో రారాజు
గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేశాయి.వెంటనే బెయిల్ రాకపోవడంతో.. ఢిల్లీలోని తిహార్ జైలులో ఆమె కొన్ని నెలల పాటు ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టులోనే కవితకు బెయిల్ వచ్చింది. జైలు నుంచి బయటికొచ్చిన కవిత.. తనను అన్యాయంగా అరెస్ట్ చేయించిన బీజేపీపై పోరాటం చేస్తానని ప్రకటించారు. అంతకంటే ముందు కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుంటానని ఆమె తెలిపారు. ఈసారి బతుకమ్మ పండుగ టైంలోనూ కవిత ఎక్కడా ప్రోగ్రాంలలో పాల్గొనలేదు. ఒకవైపు సోదరుడు, తండ్రి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. కవిత మాత్రం బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై అంతటా చర్చ జరిగింది. కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే కవిత ఇంటికి పరిమితమయ్యారనే టాక్ కూడా వినిపించింది. ఎట్టకేలకు ఇప్పుడు కల్వకుంట్ల కవిత వాయిస్ వినిపించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో మళ్లీ ఉత్తేజం వచ్చింది. తదుపరిగా రాజకీయాల్లో ఆమె యాక్టివ్‌గా మారే ఛాన్స్ ఉంది.