World Television Day 2024: తిరుగులేని ‘ఠీవీ’.. విజువల్ మీడియాలో రారాజు
ఫలితంగా టీవీల(World Television Day 2024) విక్రయాలు చాలావరకు తగ్గిపోయాయి.
- By Pasha Published Date - 04:24 PM, Thu - 21 November 24

World Television Day 2024: మనకెంతో ఇష్టమైన టెలివిజన్‌కు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ఇవాళ (నవంబరు 21) ప్రపంచ టీవీ దినోత్సవం. సమాచార రంగంలో ఒక మహా విప్లవాన్ని తీసుకొచ్చిన సాధనం టీవీ. ఇది మనిషి ఆలోచనా తీరును, జీవన శైలిని, అభిప్రాయాలను ప్రభావితం చేసింది. దేశాల రాజకీయాల గతిని కూడా టీవీ మార్చింది. ఎందుకంటే ఇందులో ప్రసారమయ్యే వార్తలు, విశ్లేషణలు, ప్రకటనలు ఓటరు మహాశయుల మైండ్ సెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. వాస్తవానికి గత పదేళ్లుగా మన దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ వినియోగం తారస్థాయిలో పెరిగింది. ఫలితంగా టీవీల(World Television Day 2024) విక్రయాలు చాలావరకు తగ్గిపోయాయి. అయినా టీవీ ఉనికి మాత్రం టూ టైర్ సిటీలు, గ్రామీణప్రాంతాల్లో సజీవంగానే ఉంది.
- 1996 నవంబర్ 21, 22 తేదీలలో ఐక్యరాజ్యసమితి మొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరమ్ సమావేశాన్ని నిర్వ హించింది. దీనికి మీడియా ప్రముఖులు హాజరయ్యారు. ఆ రోజునే.. నవంబర్ 21ని ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ఐరాస ప్రకటించింది.
- 1990వ దశకం ప్రారంభంలో కేబుల్ టీవీ ప్రసార కంటెంట్ వన్-వే ఛానల్ మాత్రమే.
- 2000వ దశకం ప్రారంభంలో అనలాగ్ నుంచి డిజిటల్ ప్రసారానికి టీవీ టెక్నాలజీ మారింది. దీనివల్ల సౌండ్, విజువల్ క్వాలిటీ పెరిగింది. హెచ్ డీ టీవీ ఛానళ్ళు అందుబాటులోకి వచ్చాయి. ప్రోగ్రామ్‌ను రికార్డింగ్ చేసుకునే వెసులుబాటు కూడా వచ్చేసింది.
- 2010 సంవత్సరం నుంచి ఓటీటీ (ఓవర్ ది టాప్) వంటి ఇంటర్నెట్ స్ట్రీమింగ్ సేవలు మొదలయ్యాయి.
- దూరదర్శన్ టీవీ ఛానల్ ప్రయోగాత్మకంగా 1959 సెప్టెంబర్ 15న ఢిల్లీలో ప్రారంభమైంది.
- 1972లో టీవీ సేవలు రెండో అతిపెద్ద నగరమైన ముంబైలో మొదలయ్యాయి.
- 1975లో కోల్‌కతా, లక్నో, చెన్నై, శ్రీనగర్, అమృత్‌సర్‌లలో టీవీ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
- 1975-–76లో శాటిలైట్ ఇన్‌స్ట్రక్షనల్ టెలివిజన్ ప్రయోగం ద్వారా 2400 గ్రామాల ప్రజలకు టెలివిజన్ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చారు.
- టీవీని చూసేవారి సంఖ్య 2029 నాటికి గరిష్ట స్థాయికి చేరుతుందని అంచనా.
- 2024లో టీవీ వీక్షకుల సంఖ్య 5.27 కోట్లు. 2029ల నాటికి ఈ సంఖ్య 5.5 కోట్లకు చేరే అవకాశం ఉంది.
- ప్రస్తుతం 25 కోట్ల టీవీ సెట్లు ఉన్నాయి. 2029 నాటికి 26 కోట్ల టీవీ సెట్లు ఉంటాయని అంచనా.