BRS Silver Jubilee : బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదిక ప్రత్యేకతలు మాములుగా లేవు
BRS Silver Jubilee : 25 సంవత్సరాల పార్టీ ప్రస్థానాన్ని ప్రజలకు తెలియజేసే ఈ సభ కోసం 1213 ఎకరాల భూమిని సేకరించి, 159 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటుచేశారు
- By Sudheer Published Date - 02:16 PM, Tue - 22 April 25

తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఈ నెల 27వ తేదీన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘనంగా జరగనుంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాన్ని బీఆర్ఎస్ పార్టీ సభకు ప్రత్యేకంగా ఎంచుకుంది. 25 సంవత్సరాల పార్టీ ప్రస్థానాన్ని ప్రజలకు తెలియజేసే ఈ సభ కోసం 1213 ఎకరాల భూమిని సేకరించి, 159 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటుచేశారు. భారీ బహుబలి వేదికతోపాటు, 150 మంది నేతలు కూర్చునేలా వేదికను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 80 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Prawns: రొయ్యలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకండి.. అవేంటంటే?
ఈ సభ ద్వారా బీఆర్ఎస్ తన మళ్లీ పునరుద్ధరణకు సంకేతాలు ఇవ్వాలని భావిస్తోంది. గత ఎన్నికలలో ఎదురైన ఓటమి అనంతరం ఈ భారీ సభ ద్వారా పార్టీ తన శక్తిని చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 10 లక్షల మందిని సభకు తీసుకురావాలని నిర్ణయించిన పార్టీ, ప్రతి ఇంటి నుండి ఒక్కరైన తరలివచ్చేలా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను మోహరించింది. భారీ బడ్జెట్‌తో నిర్వాహక కమిటీలు, నీటి సరఫరా, వసతులు, అతిథుల స్వాగతం మొదలైన అంశాలపై ప్రత్యేకంగా 50 విభాగాల్లో కమిటీలను ఏర్పాటు చేశారు.
సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బీఆర్ఎస్ నేతలు రోజుకొకరు పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్ లాంటి నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమై, సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావు సూచనలతో ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు, పార్టీకి పూర్వవైభవం కలిగించేందుకు ఈ సభను ఉపయోగించుకోనున్న బీఆర్ఎస్, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తన పట్టు చూపించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ సభలో కేసీఆర్ ఎలాంటి పంచ్ బాంబు లు విసురుతారో చూడాలి.