MLC Elections : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బీఆర్‌ఎస్ వెనుకడుగుకు గల కారణాలేంటీ..?
MLC Elections : తెలంగాణలో బీఆర్ఎస్ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో రెండు పర్యాయాలు పాలనలో ఉన్న ఈ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఆలోచనల్లో మార్పు వచ్చిందా? లేక ఇది వ్యూహాత్మక నిర్ణయమా? అనే అంశంపై విస్తృతంగా చర్చ కొనసాగుతోంది.
- By Kavya Krishna Published Date - 02:20 PM, Wed - 12 February 25

MLC Elections : తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రెండు దఫాలు వరుసగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్, ప్రత్యేక తెలంగాణ కోసం తాము చేసిన పోరాటం వల్లే రాష్ట్రం ఏర్పడిందని గొప్పలు చెప్పుకునే పార్టీ, ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనుకడుగు వేయడం చర్చనీయాంశంగా మారింది. అసలు బీఆర్‌ఎస్ ఈ నిర్ణయం వెనుక గల అసలు కారణమేంటో తెలియక రాజకీయ వర్గాలు ఊహాగానాలకు తావిస్తోంది.
ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్‌ఎస్ పరిస్థితి
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందినప్పటి నుంచీ బీఆర్‌ఎస్ రాజకీయంగా ఇబ్బందికరమైన స్థితిలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు దిశగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామంగా, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదనే వార్తలు తెరపైకి రావడంతో కొత్త చర్చకు దారి తీసింది.
Cool Water: ఏంటి వేసవికాలంలో కూల్ వాటర్ తాగితే చనిపోతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఎందుకు చేయట్లేదు?
2001లో టీఆరెసెస్‌గా స్థాపించబడిన ఈ పార్టీ, ఇప్పటివరకు అన్ని కీలక ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బయటకు వెళ్లడం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. తెలంగాణలోని కరీంనగర్, మెదక్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వెనుక గల కారణాలను అనేక కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
ఓటమి భయమేనా? రాజకీయ వ్యూహమా?
ఇలాంటి కీలకమైన ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వెనుక అసలు కారణం ఏమిటనేది ఆసక్తిగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇప్పటికే బీఆర్‌ఎస్ క్యాడర్‌లో పెరిగిన అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు పోటీ చేసి మరో ఓటమిని మూటగట్టుకోవడం కన్నా, ఈ ఎన్నికల నుంచి దూరంగా ఉండడమే మంచిదని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోందన్నది ఓ వాదన. క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గణనీయంగా తగ్గిపోయిన ఈ సమయంలో ఓటమిని మళ్లీ చవిచూడడం, పార్టీ మానసిక స్థితిని మరింత దెబ్బతీసే అవకాశముందని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీకి మద్దతేనా?
బీఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పుకోవడం వెనుక బీజేపీతో వారి అనుబంధం ఉందని మరో వాదన వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంపై బహిరంగ ఆరోపణలు చేస్తూ, “బీజేపీకి పరోక్ష మద్దతు ఇచ్చేందుకే బీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదని, ఇప్పటికే గల్లంతైన బీఆర్‌ఎస్ పూర్తిగా బీజేపీ దారిలో నడుస్తోందని” వ్యాఖ్యానించారు.
పోలిటికల్ కామెంట్స్ పీక్స్‌కు చేరిన పరిస్థితి
ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి బీఆర్‌ఎస్ వైదొలగడంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ ఇంకా కోలుకోలేదా? బీజేపీతో దోస్తీ కోసం ఇలా చేస్తున్నారా? కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిశంకు స్థితిలో ఉన్న బీఆర్‌ఎస్, తన భవిష్యత్తు కోసం కొత్త వ్యూహం రచిస్తున్నదా? అనే ప్రశ్నలు రాజకీయంగా తెరపైకి వస్తున్నాయి. బీఆర్‌ఎస్ నేతలు ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయకపోవడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ఓటమి భయమే కారణమా? లేక బీజేపీతో వ్యూహాత్మక ఒప్పందమా? అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో మరింత స్పష్టత వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం
Ram Charan : పౌరాణిక పాత్రలో ‘రామ్ చరణ్’ ..?