Bandi Sanjay: ‘పోలీస్ అధికారుల సంఘం’పై ‘బండి సంజయ్’ సంచలన వ్యాఖ్యలు… ‘మోదీ’కి ‘కేసీఆర్’ లేఖపైనా ఫైర్..!
- By hashtagu Published Date - 09:27 AM, Thu - 31 March 22

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గూండాలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నా… పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. డీజీపీ కనీసం తన ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ రబ్బర్ స్టాంపులా మారారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా ఎందుకు కేసులు నమోదు చేయడం లేదో డీజీపీ సమాధానం చెప్పాలని… లేనిపక్షంలో దద్దమ్మ అని ఒప్పుకోవాలని సూచించారు. గురువారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఘటనలో అరెస్టై జైలుకు వెళ్లిన 23 మంది బీజేపీ కార్యకర్తలు బుధవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో వారిని బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
బీజేపీ కార్యకర్తలపై సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు. జైలుకి పంపిస్తే బీజేపీ కార్యకర్తలు భయపడతారని అనుకుంటున్నారు. మళ్లీ చెబుతున్నా…. నాతో సహ ఏ బీజేపీ కార్యకర్త జైలు కి వెళ్లినా గల్లా ఎగురవేస్తాం. ఎందుకంటే మేం ప్రజల కోసం పోరాడుతున్నాం అని అన్నారు బండి సంజయ్. కానీ కేసీఆర్ కూడా త్వరలో జైలుకి వెళ్తారు. అప్పుడు జనం కేసీఆర్ ను ఛీ కొట్టడం ఖాయమని చెప్పారు. సిరిసిల్ల ఎస్పీ ఓ రబ్బర్ స్టాంప్ .., సీఎంవో ఏది చెబితే అది చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ ని విమర్శిస్తే కొంతమంది పోలీస్ సంఘాల సభ్యులు మాట్లాడుతున్నారు. సిరిసిల్ల గొడవలో కొంతమంది పోలీస్ లు సీఎం ఆదేశాల ప్రకారం కేసులు కూడా నమోదు చేయడం లేదు. పదేపదే మాట్లాడుతున్న కొందరు పోలీస్ సంఘాల నాయకులు, ఈ విషయంలో ఏం సమాధానం చెబుతారు? ఇలాంటి అరాచకాలపై ఎందుకు మాట్లాడరు ఇదే విధంగా వ్యవహరిస్తే…. రిటైర్ అయ్యాక మిమ్ముల్ని కుక్కలు కూడా పట్టించుకోవు … చివరకు మీ పిల్లలే మిమ్మల్ని ప్రశ్నిస్తారని గుర్తుంచుకోండి.
ఇకనైనా అధికార పార్టీ మోచితి నీళ్లు తాగి పని చేయకండి. చట్టం, న్యాయం ప్రకారం పని చేయండని సూచించారు బండి సంజయ్. తక్షణమే డీజీపీ దీనిపై సమాధానం చెప్పాలి. లేదంటే దద్దమ్మ అని ఒప్పుకో … సీఎంఓ మాత్రమే ముఖ్యమని చెప్పండి. డీజీపీకి నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు … ట్యాపింగ్ జరుగుతోందని భయపడుతున్నారు. ఎల్లారెడ్డి పేట ఘటన లో బీజేపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. బోధన్ లోనూ ఇలాగే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. బైంసాలోనూ దాడులు చేసి జైలుకు పంపారు. కార్యకర్తలను పరామర్శించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు, ఒవైసికి మాత్రం బోదన్ లో ప్రశాంతంగా తిరిగేలా అనుమతిచ్చారు. ఇదెక్కడి న్యాయం ? అని ప్రశ్నించారు బండి సంజయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం తొత్తుగా మారారు. బీజేపీని బదనాం చేయడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారు.
ముఖ్యమంత్రే బాయిల్డ్ రైస్ ఇవ్వమని అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆయనే బాయిల్డ్ రైస్ తీసుకోవాలని గ్రామాల నుండి తీర్మానాలు చేస్తున్నాడు. రారైస్ కొంటామని మేము చెబుతుంటే… ఇవ్వబోమని చెబుతోంది సీఎం కేసీఆరే. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసి, రైతులను గందరగోళంలోకి నెట్టింది కేసీఆరే. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుంది? సమస్యని కావాలనే సీఎం కేసీఆర్ సృష్టిస్తున్నారు. విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని కోరుతున్నా అన్నారు బండి సంజయ్. ఉక్రెయిన్ విద్యార్థులను ఆదుకోవాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఇప్పుడు ప్రధానికి లేఖ రాసి క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు.యుద్ద సమయంలో అల్లాడిపోయిన ఉక్రెయిన్ విద్యార్థులను కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి పరామర్శించన దుర్మార్గుడు కేసీఆర్. ఉక్రెయిన్ యుద్ధం కంటే ఇక్కడ పెరిగిన విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలను, విద్యుత్ కోతలను చూసి భయపడుతున్నారు … పెరిగిన కరెంట్ బిల్లులు చేతికందాక టీఆర్ఎస్ ప్రభుత్వంపై జనం తిరగబడటం ఖాయమని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.