తెలంగాణలో కొత్త సర్పంచుల అపాయింట్మెంట్ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!
సుదీర్ఘ విరామం తర్వాత గ్రామాల్లో మళ్లీ పాలకవర్గాలు వస్తుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలు, ఇకపై ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. సర్పంచులతో పాటు వార్డు సభ్యులు కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
- Author : Gopichand
Date : 17-12-2025 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
- తెలంగాణలో కొత్త సర్పంచుల అపాయింట్మెంట్ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా
- నెల 20న అమావాస్య కావటంతో 22కు వాయిదా వేయాలని కోరిన ప్రజాప్రతినిధులు
- దీంతో 22కు వాయిదా వేసిన పంచాయతీ రాజ్ శాఖ
New Sarpanches: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచుల బాధ్యతల స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ నెల 20న నిర్వహించాలని భావించిన సర్పంచుల అపాయింట్మెంట్ డే (ప్రమాణ స్వీకారోత్సవం) ఇప్పుడు ఈ నెల 22కు వాయిదా పడింది. ఈ మార్పుకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ అధికారిక ఉత్తర్వులను వెలువరించింది.
వాయిదాకు గల ప్రధాన కారణం
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిసి కొత్త సర్పంచులు ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రభుత్వం తొలుత డిసెంబర్ 20వ తేదీని ముహూర్తంగా నిర్ణయించింది. అయితే పంచాంగం ప్రకారం ఈ నెల 20వ తేదీన ‘అమావాస్య’ కావడంతో ఆ రోజున పదవీ బాధ్యతలు చేపట్టడం శుభప్రదం కాదని పలువురు ప్రజాప్రతినిధులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు భావించారు.
అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించడం సెంటిమెంట్‌గా కలిసి రాదని, కావున తేదీని మార్చాలని రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విన్నవించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఈ అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలించిన పంచాయతీ రాజ్- గ్రామీణాభివృద్ధి శాఖ, కార్యక్రమాన్ని రెండు రోజులు వెనక్కి జరిపి డిసెంబర్ 22కు ఖరారు చేసింది.
Also Read: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి!
కార్యక్రమ నిర్వహణ ఇలా
ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచులు కొలువుదీరనున్నారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే గ్రామ సభల్లో అధికారులు కొత్త సర్పంచుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచులు తమ కార్యాలయాల్లో బాధ్యతలు చేపడతారు. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గ్రామ అభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలపై అధికారులతో చర్చించనున్నారు.
పల్లెల్లో సందడి
సుదీర్ఘ విరామం తర్వాత గ్రామాల్లో మళ్లీ పాలకవర్గాలు వస్తుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలు, ఇకపై ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. సర్పంచులతో పాటు వార్డు సభ్యులు కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుభ ముహూర్తాన బాధ్యతలు చేపట్టడం ద్వారా గ్రామాలకు మంచి జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, డీపీఓలు ఇప్పటికే 22వ తేదీన నిర్వహించాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించారు.