KCR Comments: తెలంగాణలో మరోసారి ఉప ఎన్నికలు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అయితే వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కింది. ఆ తర్వాత అనేక కారణాల వలన అనర్హత వేటు పిటిషన్ సుప్రీంకోర్టుకు చేరింది.
- By Gopichand Published Date - 08:31 PM, Tue - 11 February 25

KCR Comments: తెలంగాణలో గత 10 రోజులుగా రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. రోజుకో స్టేట్మెంట్‌తో రాజకీయ నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పథకాలపై రాజకీయం నడవగా.. ఇప్పుడు ఉప ఎన్నికలపై ఇరు పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగా.. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ విజయంతో గెలుపొంది అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
అయితే వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కింది. ఆ తర్వాత అనేక కారణాల వలన అనర్హత వేటు పిటిషన్ సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు సైతం పార్టీ మారిన వారు త్వరగా తమ వివరణ ఇవ్వాలని ఇటీవల నోటీసులు పంపింది. దీంతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ (KCR Comments) తాజాగా పిలుపునిచ్చారు.
అయితే మంగళవారం కేసీఆర్ మరోసారి ఉప ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ది చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ లోను ఉప ఎన్నిక వస్తుంది.. కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని కేసీఆర్ హింట్ కూడా ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిసిన సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ సమక్షంలో ధర్మసాగర్ మాజీ జెడ్పిటిసి కీర్తి వెంకటేశ్వర్లు, మరికొంతమంది ఇతర పార్టీ నాయకులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ నెల 15న తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మందితో చేరికల కార్యక్రమం ఉంటుందని రాజయ్య పేర్కొన్నారు.