Minister Ponnam: సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్‌లో వెళ్లిన మంత్రి
పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయం మహిమ గల ఆలయమని, గుట్టపైకి మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
- By Gopichand Published Date - 05:15 PM, Tue - 14 January 25

Minister Ponnam: హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) దర్శనం చేసుకున్నారు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన మకర సంక్రాంతి సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి ఆశీర్వాదం కోసం వస్తున్న భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వక స్వాగతం పలికారు. భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలన్నారు.
సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అన్నారు. మంచి వర్షాలు సమృద్ధిగా, పడి పంటలతో ఆయురారోగ్యాలతో రైతులంతా బాగుండాలని కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని ప్రార్థిస్తున్నా అని తెలిపారు. ప్రభుత్వం తరఫున , దేవాదాయ శాఖ తరపున, పోలీసు యంత్రాంగము, జిల్లా యంత్రాంగము ఈ ఉత్సవాల కోసం అన్ని రకాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే భక్తులు క్షమించాలని కోరారు. ఊహించిన దానికన్నా భక్తులు అధికంగా వచ్చినట్లు మంత్రి మీడియాకు తెలిపారు. 27 రోజులు భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామివారి మాలాధార వేసుకున్నట్లు చెప్పారు.
Also Read: Global Star Ram Charan: ఫ్యాన్స్ కోసం రామ్ చరణ్ ప్రత్యేక నోట్.. ఏం రాశారంటే?
ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకుని క్రమశిక్షణతో మాల పూర్తి చేసుకున్నానని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్, పీవీ స్మారకం, వరంగల్ లో ఉన్న భద్రకాళి ఆలయం, పక్కనే ఉన్న త్రికూటాలయం అభివృద్ధి టూరిజం హబ్ గా చేస్తామని హామీ ఇచ్చారు. నిత్యం పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దేవదయ శాఖ పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తకొండ వీరభద్రస్వామి ధర్మకర్తలు కూడా హసన్పర్తి, హుజురాబాద్, ఘనపూర్ , హుస్నాబాద్ అన్ని మండలాల నుండి తీసుకున్నామన్నారు. పక్కన ఉన్న శాసనసభ్యుల సహకారం తీసుకొని దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయం మహిమ గల ఆలయమని, గుట్టపైకి మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధమే అని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. కొత్తకొండ మండల ప్రతిపాదనలు పంపామన్నారు. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు కొత్తకొండ మండలం ఏర్పడుతుందని, భీమదేవరపల్లి మండలం పీవీ నరసింహారావు స్వగ్రామం వంగరలో బండి సంజయ్ సహకారంతో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు.