Dengue Cases : వామ్మో 4,294 డెంగీ కేసులు.. బాధితుల్లో ఎక్కువమంది పిల్లలే
డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటున్నప్రతి 100 మందిలో 6.5 మందికి పాజిటివ్ వస్తోంది.
- By Pasha Published Date - 09:07 AM, Tue - 27 August 24

Dengue Cases : తెలంగాణలో చాపకింద నీరులా డెంగీ విజృంభిస్తోంది. వాటికి సంబంధించిన కేసులు క్రమంగా పెరుగుతూపోతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో రాష్ట్రంలో 4,294 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటున్నప్రతి 100 మందిలో 6.5 మందికి పాజిటివ్ వస్తోంది. అంటే వారికి డెంగీ ఉందని నిర్ధారణ అవుతోందన్న మాట. డెంగీ(Dengue Cases) లక్షణాలున్న వారి నుంచే సేకరించే ప్రతీ 200 శాంపిళ్లలో 13 మందికి డెంగీ ఉన్నట్లు కన్ఫార్మ్ అవుతోంది. సాక్షాత్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విభాగమే ఈవివరాలను వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join
డెంగీ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు అలర్ట్‌గా ఉండాలి. దోమల బెడద నుంచి తమను తాము రక్షించుకోవాలి. ప్రత్యేకించి ఉదయం వేళ దోమలు కుట్టకుండా జాగ్రత్తపడాలి. జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించిన తగిన మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. ఎంత త్వరగా డెంగీ లక్షణాలను గుర్తిస్తే అంత ఈజీగా చికిత్స పూర్తయి కోలుకుంటారు. రాష్ట్రంలో డెంగీ కేసులు అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదవుతున్నాయి. నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల్లో చాలామందికి డెంగీ నిర్ధారణ అవుతోంది. బాధితుల్లో ఎక్కువగా ఏడాదిన్నర నుంచి 12 ఏళ్లలోపు పిల్లలే ఉంటున్నారు.
Also Read :Yoga : స్త్రీలు ఈ 5 యోగా ఆసనాలు చేయాలి, వారు పీరియడ్స్ నొప్పి నుండి కూడా ఉపశమనం పొందుతారు.!
పిల్లలకు జ్వరం వచ్చి ఎంతకూ తగ్గకుంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో పిల్లలు డయేరియా, టైఫాయిడ్ బారినపడే రిస్క్ కూడా ఉందని అంటున్నారు. దోమల నివారణకు పాఠశాలల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇక సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోనూ డెంగీ కేసులు బయటపడుతున్నాయి. సెప్టెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవలే 152 మందికి చికెన్ గున్యా, 191 మందికి మలేరియా సోకింది.